కేసీఆర్ పరిస్థితి కొంత మెరుగు. జగన్మోహన్ రెడ్డి అంతకంటె దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్నారు. కేసీఆర్ 119లో 39 సీట్లు గెలిస్తే.. జగన్ 175లో కేవలం 10 గెలిచారు. ఇంత ఘోరమైన పరాజయం బహుశా ఇటీవలి కాలంలో ఎక్కడా నమోదు కాలేదు. అచ్చంగా కేసీఆర్ మాదిరిగానే అపరిమితమైన అహంకారంతో చెలరేగుతూ పరిపాలన సాగించినందుకు జగన్మోహన్ రెడ్డి కూడా ఫలితం అనుభవించారు. అయితే ఓటమి తర్వాత అయినా.. జగన్ యువతరానికి చెందిన నాయకుడు గనుక.. ఆయనలో కొద్దిగా సంస్కారం, ఆలోచన వచ్చి ఉంటే బాగుండేది. కానీ.. ఆయన ముసలితనం కారణంగా అహంకారం వీసమెత్తుకూడా తగ్గించుకోలేకపోయిన కేసీఆర్ మార్గాన్నే అనుసరిస్తున్నారు. తనలోని అహంకారాన్ని అలాగే పదిలంగా కాపాడుకుంటున్నారు. దారుణంగా ఓడిపోయిన తర్వాత ఆయన తన రాజీనామా లేఖను గవర్నరు కార్యాలయానికి నేరుగా వెళ్లి ఇవ్వకుండా మరొక మనిషితో పంపారు. ఇది ఆయనలో తగ్గని అహంకారానికి నిదర్శనంగా పలువురు అంటున్నారు.
సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోతే.. ముఖ్యమంత్రి నేరుగా వెళ్లి గవర్నరును కలిసి చివరిసారిగా భేటీ అయి రాజీనామా లేఖను సమర్పించి రావడం సాంప్రదాయం. అదేమీ రూల్ కాదు. కానీ.. అందరూ ఆ సాంప్రదాయాన్ని పాటిస్తారు. అదే తరహాలో.. జగన్మోహన్ రెడ్డి కూడా.. కాసేపట్లో గవర్నరును కలవడానికి వెళ్లబోతున్నారంటూ మంగళవారం మధ్యాహ్నం నుంచి అనేక వార్తలు వచ్చాయి. నిజానికి రాజభవన్ వద్ద మీడియా వాళ్లు జగన్ రాక కోసం ఎదురుచూస్తూ మోహరించారు కూడా. కానీ.. జగన్మోహన్ రెడ్డి 6 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత.. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా.. నేరుగా లేచి వెళ్లిపోయారు. గవర్నరు వద్దకు వెళ్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన వేరే వ్యక్తితో తన రాజీనామా లేఖను పంపారు.
అచ్చంగా కేసీఆర్ పరాజయం తర్వాత కూడా ఇలాగే జరిగింది. ఆరోజు కూడా కేసీఆర్ రాజభవన్ కు వెళ్లబోతున్నారంటూ బ్రేకింగ్ న్యూస్ వచ్చాయి. కానీ.. చివరికి ఆయన వేరే వ్యక్తి ద్వారా రాజీనామా లేఖను పంపారు. ఆ రకంగా ఆయన తన అహంకారాన్ని పదవిలోని చివరిక్షణాల్లో కూడా కాపాడుకున్నారు. జగన్ కూడా చూడబోతే, కేసీఆర్ నే అహంకారం విషయంలో ఆదర్శంగా తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఈ యువనాయకుడు కూడా అలా సాంప్రదాయం పాటించకపోవడాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు. జగన్ కు చింతచచ్చినా పులుసు చావలేదని ఎద్దేవా చేస్తున్నారు.
కేసీఆర్ లాగే : చింతచచ్చినా పులుసు చావలేదు!
Thursday, November 14, 2024