వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో నెమ్మది నెమ్మదిగా అసంతృప్తి జ్వాలలు రగులుకుంటున్నాయి. తమను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఏం సంజాయిషీ చెప్పుకోవాలో తెలియని సంకోచం నుంచి.. వారిలో ఆగ్రహం కూడా మొదలవుతోంది. పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఉండే గౌరవం అభిమానం కూడా సన్నగిల్లుతున్నాయి. జగన్ కారణంగా అసెంబ్లీకి వెళ్లకుండా డుమ్మా కొట్టి ఇళ్లలో గడుపుతున్న తమ గౌరవం కాపాడుకోవడం ఎలాగో వారికి అర్థం కావడం లేదు. ప్రధాన ప్రతిపక్షానేత హోదా ఇస్తే మాత్రమే సభలో అడుగు పెడతానని జగన్మోహన్ రెడ్డి తన గైర్హాజరీని తాను సమర్ధించుకుంటున్నారు. అయితే మిగిలిన పదిమంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి? వాళ్ళు ఎందుకు ఆబ్సెంట్ అవుతున్నట్లు? వారి తరఫున ఎలాంటి సంజాయిషీ చెప్పుకోగలరు? ఇవన్నీ కూడా ప్రశ్నలే. శాసనసభకు హాజరు కాకపోవడం వలన, సొంత నియోజకవర్గాల్లో కూడా తమ పరువు మంటగలుస్తుందనే భయం వైసీపీ ఎమ్మెల్యేలలో తారస్థాయికి చేరుకుంటోంది. గురువారం నాడు ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ అసంతృప్తి బాహాటంగా వ్యక్తం కావచ్చునని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోవడం పట్ల ప్రజలలో నిశితంగా చర్చ జరుగుతోంది. కూటమి పార్టీలకు చెందిన నాయకులు వీరి చర్యను ఘోరంగా హేళన చేస్తున్నారు. స్పీకరు అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు అయితే అసలు సభకు హాజరు కాని వారికి జీతాలు ఎందుకు ఇవ్వాలి? వారిని పదవుల నుంచి ఎందుకు తొలగించకూడదు? లాంటి ప్రశ్నలతో వారిలో భయాన్ని పుట్టిస్తున్నారు. ఏడాదికి కనీసం 60 రోజులపాటు శాసనసభ సమావేశాలు జరగాలి అని పదేపదే చెబుతున్న స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ కూడా ఏడాదిలో కనీసం 50 రోజులు శాసనసభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై వేటు వేయాలని ఏకంగా లోక్ సభ స్పీకర్ వద్ద ప్రతిపాదిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో జగన్ తమ పదిమంది భవిష్యత్తు గురించి ఏమాత్రం కనీస స్పృహ లేకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయం ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో కలుగుతోంది. పార్టీలో ఆ ప్రకటిత తిరుగుబాటుకు ఇది కారణం కాగలదని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ తరఫున గెలిచిన వారి సంగతి పట్టించుకోకుండా.. తనంత తాను తన ప్రతిపక్ష హోదా కోసం ఆరాటపడుతుండడం.. తద్వారా వచ్చే లబ్ధి గురించి ఆలోచిస్తుండడం.. ఆయన అనుచర ఎమ్మెల్యేలకు అసహ్యం పుట్టిస్తోంది. అధినాయకుడి స్వార్థానికి తాము ఎందుకు బలికావాలనే ప్రశ్న కూడా వారిలో ఉత్పన్నం అవుతోంది. ఈ పరిణామాలు వైసీపీ పార్టీలో ఎటు దారితీస్తాయో చూడాలి.
వైసీపీ ఎమ్మెల్యేల్లో రేగుతున్న అసంతృప్తి జ్వాలలు!
Thursday, December 4, 2025
