పాపం ఆ నలుగురు.. ఊరట తాత్కాలికమే అవుతుందా?

Thursday, December 4, 2025

లిక్కర్ కేసులో ఇప్పటికి మొత్తం అయిదుగురు నిందితులకు బెయిలు లభించింది. పైలా దిలీప్ తొలుత బెయిల్ తీసుకున్నారు. ఆ తరువాత.. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిలు తీసుకున్నారు.. ఎంపీ మిథున్ రెడ్డి. ఆయన ఎంపీ గనుక, ఎన్నికల్లో ఓటు వేయాలి గనుక.. కోర్టు బెయిలు ఇచ్చింది. అలాగే జగన్ కు అత్యంత ఆత్మీయులు ఆయన తరఫున సకల వ్యవహారాలను చక్కబెట్టే కార్యసామర్థ్యం ఉన్న ఉద్ధండులు ముగ్గురికీ కూడా బెయిలు లభించింది. అయితే.. పైలా దిలీప్ ను మినహాయిస్తే మిగిలిన నలుగురికీ.. బెయిలు ద్వారా లభించిన ఊరట తాత్కాలికం మాత్రమేనేమో అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది.

పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిలు లభించినప్పుడే అది తాత్కాలికం అనే సంగతి అందరికీ తెలుసు. ఎందుకంటే.. ఆయన ఎంపీగా ప్రస్తుతం పదవిలో ఉన్నాడు గనుక.. దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగులో ఆయన పాల్గొనాలి గనుక.. ఆ ప్రత్యేక అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఇచ్చిన మధ్యంతర బెయిలు మాత్రమే అది. బెయిలు ఇచ్చినప్పుడే.. పోలింగు ముగిసిన తర్వాత 11 వతేదీ సాయంత్రంలోగా తిరిగి రాజమండ్రి వచ్చి అక్కడ జైలులో లొంగిపోవాల్సిందిగా స్పష్టంగా పేర్కొన్నారు. సోమవారం నాడు ఆయన రెగులర్ బెయిలు పిటిషన్ కు సంబంధించిన వాయిదా ఉండింది. అయితే.. తాను మధ్యంతర బెయిలుపై ఉండగానే.. రెగులర్ బెయిలు కూడా వచ్చేస్తుందేమో అనే ఆశతో మిథున్ రెడ్డి రెండు రోజులు గడిపారు గానీ.. ఈలోగా సోమవారం పిటిషన్ విచారణ తర్వాత తుదితీర్పు ఇవ్వకుండా దానిని 12వ తేదీకి వాయిదా వేశారు. అంటే మిథున్ రెడ్డి 11న సాయంత్రం తిరిగి జైలుకు వెళ్లకతప్పదు. ఆయన బెయిలు తాత్కాలికం అన్నది తేలిపోయింది.

ఇక మిగిలిన ముగ్గురి సంగతి. జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయులు అయిన అపర చాణక్యులు సకల దందాలకు కర్తలు ధనంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలకు కూడా బెయిలు లభించింది. సంగ్రామంలో విజయం సాధించిన అతిరథ మహారథులను స్వాగతిస్తున్నట్టుగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు నానా హడావుడి చేసి తీసుకువెళ్లారు. అయితే ఈ ముగ్గురికీ లభించిన బెయిలు కూడా తాత్కాలికమే అవుతుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే.. వీరి బెయిలును రద్దు చేయాలని కోరుతూ సిట్ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ వాయిదా పడింది. బెయిలు ఇచ్చే సందర్భంగా ఏసీబీ కోర్టు జారీచేసిన మెమొరాండం అమలుపై స్టే ఇచ్చిన హైకోర్టు, ఆ ముగ్గురూ ఆల్రెడీ విడుదల అయినందున వారికి నోటీసులు ఇచ్చింది.

మూడున్నర వేల కోట్ల రూపాయలను అడ్డగోలుగా జగన్ దళాలు కాజేసిన వ్యవహారంలో ఇంకా నేరస్తులు ఎవరో ఎందరో ఎవరెవరి వాటా ఎంతనో.. అన్నింటినీ మించి అంతిమ లబ్ధిదారు ఎవరో ఇంకా లెక్కతేలనే లేదు. అంతిమలబ్ధిదారుకు వసూళ్ల సొమ్మును స్వయంగా చేరవేసిన ప్రముఖులుగా ధనంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అలాగే, అంతిమ లబ్ధిదారు వరకు చేరిన నల్ల ధనాన్ని.. తెల్లధనంగా రూపు మార్చడానికి ఏయే వక్రమార్గాలను అనుసరించాలి, ఏయే పద్ధతుల్లో డబ్బు మతలబులు చేయాలి అనే విషయంలో గోవిందప్ప బాలాజీ కీలకంగా వ్యవహరించారనేది అసలు ఆరోపణలు. అలాంటి నేపథ్యంలో.. ఇంత కీలక సమయంలో వారికి బెయిలు ఇవ్వడం వలన.. అంతిమ లబ్ధిదారు అలర్ట్ అయ్యే ప్రమాదం ఉన్నది కదా అని పలువురు విశ్లేషిస్తున్నారు. వారి దగ్గరినుంచి అసలు వివరాలు తెలుసుకోకుండానే బెయిలు ఇవ్వడం వలన.. కేసు విచారణ నీరుగారిపోతుందని.. వారు సాక్షులను, ఆధారాలను కూడా ధ్వంసం చేసే అవకాశం ఉన్నదని, వారంతా పవర్ ఫుల్ వ్యక్తులు గనుక.. కేసువిచారణకు ప్రమాదం ఉన్నదని పోలీసులు వాదిస్తున్నారు. మరి వీరి బెయిలు విషయంలో హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో.. వారి బెయిలు తాత్కాలికమే అవుతుందో లేదో వేచిచూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles