అరెస్టు భయం : కొత్త పాట  ఎత్తుకున్న మిథున్ రెడ్డి!

Monday, December 8, 2025

రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇప్పుడు కొత్త పాట ఎత్తుకున్నారు. విచారణకు పిలిచిన పోలీసులు తనను కొడతారేమోనని భయం నటిస్తున్నారు. దుర్భాషలాడతారని, తిడతారని పాపం.. ఆందోళన చెందుతున్నారు. ఇదంతా కామెడీ కాదు. కోర్టులో వేసిన పిటిషన్ సాక్షిగా.. ఆయన ప్రదర్శిస్తున్న ఆందోళన అనేది నిజం. అయితే ఇలాంటి ఎత్తుగడలు వేయడం ద్వారా ఎలాంటి వక్ర ప్రయోజనం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారో దానికి మాత్రం న్యాయస్థానం నో చెప్పింది. ఆయన కోరినట్టెల్లా విచారణాధికారులను ఆదేశించడం కుదరదు అని తేల్చేసింది.

జగన్ జమానాలో మూడువేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన లిక్కర్ స్కామ్ నడపడంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ కీలకమైన తెరవెనుక సూత్రధారి అనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి  విచారణలో వెల్లడించిన పేర్లలో మిథున్ రెడ్డి పేరు కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. దీనిని సాకుగా చూపించి.. తనను సిట్ పోలీసులు అరెస్టు చేస్తారని, తనకు ముందస్తు బెయిలు ఇవ్వాలని.. తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టులో పిటిషన్లు వేయడం ద్వారా రకరకాల డ్రామాలు నడిపించారు మిథున్ రెడ్డి. అయితే వాటన్నింటినీ హైకోర్టు కొట్టివేసింది. కేసులో ఆయన పేరు లేకుండా, పురోగతి కూడా లేకుండా.. ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేం అని స్పష్టం చేసింది.

విచారణ క్రమంలో తేలిన సంగతుల ప్రకారం.. విక్రయాల్లో తమకు వాటాలు ఇచ్చే డిస్టిలరీలకు మాత్రమే ప్రభుత్వం ఆర్డర్లు పెట్టేది. ఆయా డిస్టిలరీలనుంచి పెంచిన ధరల ప్రకారం వాటాలు వసూళ్లు చేసే నెట్ వర్క్ కు సారథిగా అప్పటి ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యవహరించారు. వసూళ్ల నెట్ వర్క్ ద్వారా వచ్చిన మొత్తాలను ఆయన మిథున్ రెడ్డికి చేర్చే వారని, ఆయన ఆ పై వారికి చేర్చేవారని తేలింది. ఇప్పుడు కసిరెడ్డి పరారీలో ఉన్నారు. సిట్ పోలీసులు 19వ తేదీ శనివారం విచారణకు రావాల్సిందిగా.. మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఎంపీగా అధికారంలో ఉన్న మిథున్ రెడ్డి.. కసిరెడ్డి మాదిరిగా హఠాత్తుగా అదృశ్యం అయి పరారీలోకి వెళ్లడం కొంచెం కష్టం. పైగా అది తన మీద అనుమానాలు పెంచుతుందని ఆయనకు తెలుసు. అందుకే హైకోర్టును ఆశ్రయించి.. 19న విచారణలో పోలీసులు తనను కొట్టడానికి, దుర్భాషలాడడానికి అవకాశం ఉన్నదని.. కాబట్టి తన విచారణ మొత్తం వీడియో ఆడియో రికార్డింగు చేయించేలా ఆదేశించాలని కోరుతూ ఒక పిటిషన్ వేశారు. అయితే ఈ విజ్ఞప్తిని కోర్టు పట్టించుకోలేదు. కావాలంటే.. సీసీ కెమెరాలున్న చోట విచారణ జరగాలని ఆదేశించగలం అని పేర్కొంది. ఆయన ఇద్దరు న్యాయవాదులతో విచారణకు వెళ్లవచ్చునని, విచారణ సమయంలో ఒక్క న్యాయవాది మాత్రం పది అడుగుల దూరంలో ఉండవచ్చునని, విచారణలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించరాదని ఆదేశించింది.

అయితే ఇలాంటి పిటిషన్ వేయడం ద్వారా సిట్ పోలీసులు తనను ఏదో చేసేయబోతున్నట్టుగా.. ప్రజలను మభ్యపెట్టడానికి.. తద్వారా వారి జాలి పొందడానికి మిథున్ రెడ్డి కుటిల ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles