వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయిదేళ్ల పదవీకాలంలో.. కొత్త లిక్కర్ విధానం తీసుకువచ్చి.. ప్రపంచంలో ఎవ్వరి ఊహకు కూడా అందని సరికొత్త విధానాల్లో దోపిడీపర్వం కొనసాగించారు. అన్ని రాష్ట్రాల పాలకులు కూడా దోచుకోవాలంటే.. ఇలా చేస్తే బాగుంటుంది అనుకునేలా జగన్ దోపిడీ పర్వం సాగింది. శాశ్వతంగా తానే అధికారంలో ఉండిపోతానని అనుకున్న జగన్మోహన్ రెడ్డి.. విచ్చలవిడిగా వ్యవహరించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఆయన పాపాలు అన్నీ బయటకు వస్తున్నాయి. ఆయన అండ చూసుకుని.. తమ పరిధిలో దోపిడీలు సాగించిన వైసీపీ నాయకులు ఒక్కొక్కరి మీద ఇప్పుడు కేసులు నమోదు అవుతున్నాయి. అయితే దాదాపు 20 వేల కోట్ల రూపాయలకు పైగా కాజేసినట్టుగా ఆరోపణలు వస్తున్న లిక్కరు స్కాం వ్యవహారంలో ఏం జరిగిందో విచారించి నిజాలు తేల్చడానికి, నేరస్తులను కటకటాల వెనక్కు పంపడానికి ఏకంగా కేంద్రమే రంగంలోకి దిగుతోంది.
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంటులో ఏపీ లిక్కరు స్కామ్ ను ప్రస్తావించినందుకు ఫలితం కనిపిస్తోంది. ఈ లిక్కరు స్కామ్ ద్వారా కాజేసిన సొమ్ములో దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు దేశం దాటించారంటూ.. ఆయన పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు.. కేంద్రంలో ప్రకంపనలు పుట్టించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా లావు శ్రీకృష్ణదేవరాయలును తన వద్దకు పిలిపించుకుని వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు.
జగన్ వచ్చిన తర్వాత అసలు లిక్కర్ దందా అనేది ఏ విధంగా జరిగిందో.. కొత్త లిక్కర్ పాలసీ పేరుతో ఎన్ని రకాలుగా దోచుకున్నారో.. విపులంగా వివరించారు. మద్యం కంపెనీలను బెదిరింపుల ద్వారా చేజిక్కించుకోవడం దగ్గరినుంచి, తమకు వాటాలు ఇచ్చే కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు పెట్టడం, ప్రభుత్వం నిర్వహించిన దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలు లేకుండా మాయచేయడం, విపరీతంగా ధరలు పెంచి ఆ పెంచిన ధరలను కంపెనీలకు చెల్లించిన తర్వాత.. వారినుంచి అడ్డదారుల్లో పుచ్చుకోవడం.. సమస్తం అమిత్ షా దృష్టికి తీసుకొచ్చారు లావు శ్రీకృష్ణదేవరాయలు! అమెరికాలోని సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్ లోని ఇన్‌ఫ్రా కంపెనీకి వేల కోట్ల రూపాయలు తరలించిన వైనం కూడా ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ మద్యం స్కాం బాగోతాలపై ఈడీ దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉన్నదని లావు శ్రీకృష్ణదేవరాయలు విన్నవించారు.
మొత్తానికి అమిత్ షా ఈ వ్యవహారాన్ని సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఏపీ భాజపా సారథిగా పురందేశ్వరి బాధ్యతలు తీసుకున్న నాటినుంచి.. లిక్కరు స్కామ్ గురించి పదేపదే చెబుతూనే ఉన్నారు. జగన్ లిక్కర్ స్కామ్ ద్వారా ఏకంగా లక్ష కోట్ల రూపాయల దాకా అక్రమాలు చేస్తున్నట్టుగా ఆమె వెల్లడిస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారికంగా విచారణ జరిపి.. అనేక అక్రమాలు జరిగినట్టు గుర్తించింది.. ఇప్పుడు స్వయంగా కేంద్ర హోంమంత్రి రంగంలోకి దిగారు. లిక్కర్ స్కామ్ నిందితులు ఇక తప్పించుకోలేరని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
లావు ఎఫెక్ట్ : భరతం పట్టనున్న అమిత్ షా!
Sunday, March 30, 2025
