రాజకీయాల్లో గెలుపుఓటములు సహజం. కానీ ఓడిపోయినప్పుడు పార్టీ అధినేత పార్టీని మరింతగా బలోపేతం చేయడం గురించి దృష్టిపెట్టాలి. పార్టీ శ్రేణులు కోరుకునేది అదే. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైన తర్వాత.. జగన్మోహన్రెడ్డి ఆపని చేస్తున్నారా? అసలు పార్టీ గురించి ఆయనకు పట్టింపు ఉందా? కేవలం ప్రభుత్వాన్ని తిట్టడం ద్వారా మాత్రమే మళ్లీ తాను గద్దె ఎక్కగలనని అనుకుంటున్నారా..? అనేది పార్టీ శ్రేణుల్లో సందేహంగా ఉంది. ఒకవైపు కీలక నాయకులు పలువురు పార్టీని వీడిపోతుండగా.. అధినేత నష్టనివారణ చర్యలు కూడా చేపట్టకపోవడం అనేది శ్రేణుల్లో ఒకరకమైన భయాన్ని పుట్టిస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి ఓటమి తర్వాత ఇప్పటికి నలుగురు తాజామాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బయటకు వెళ్లారు. వీరందరూ కామన్ గా చెప్పిన కారణం మాత్రం ఒక్కటే. పార్టీలో తమకు సాధారణ కార్యకర్తకు దక్కవలసిన గౌరవం కూడా దక్కడం లేదని వారు వాపోతున్నారు. పార్టీని వీడిపోతున్న నాయకులందరూ అవకాశవాదులు అని నిందించి, అక్కడితో అధినేత చేతులు దులుపుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే పార్టీని వీడిపోయిన వారు ఇప్పటిదాకా ఇతర పార్టీల్లో కూడా చేరలేదు.
ఇప్పటిదాకా పార్టీ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యేలు మద్దాళి గిరి, కిలారు రోశయ్య, పెండెం దొరబాబు ఆల్రెడీ వెళ్లిపోయారు. వీరు పార్టీ మీద చాలా నిందలు కూడా వేశారు. జగన్ తమకు అన్యాయం చేశాడని అన్నారు. అయితే తాజాగా మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) కూడా వెళ్లిపోవడం పార్టీ శ్రేణులకు కూడా మింగుడుపడడం లేదు.
నిజానికి పార్టీలోని ఇంకా పలువురు నాయకులు వైసీపీని వీడడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ, అధినేత జగన్మోహన్ రెడ్డి వారు వెళ్లకుండా ఆపడం గురించి పట్టించుకోవడం లేదనే అభిప్రాయం పలువురిలో ఉంది. కనీసం కార్యకర్తలతో సమావేశాలు పెట్టినప్పుడు.. పార్టీ ఓటమికి వారి నుంచి కారణాలు వినే ఓపిక కూడా లేని జగన్.. పార్టీని బలోపేతం గురించి అసలు పట్టించుకుంటున్నారా? లేదా? అనేది పార్టీ శ్రేణుల్లోని ఆలోచన. నిజానికి పార్టీని వీడిపోయిన నాయకుల అనుచరులందరూ కూడా అయోమయంలో ఉన్నారు. పార్టీలోనే ఉండాలా? తాము కూడా రాజీనామాలు చేయాలా? అని ఆలోచిస్తున్నారు. పార్టీని కాపాడుకోవాలంటే.. ఇకపై ఎవ్వరూ రాజీనామాలు చేయకుండా జగన్ జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
రాలుతున్న వికెట్లు : అయోమయంలో వైసీపీ శ్రేణులు!
Sunday, December 22, 2024