అధికారాంతమునందు చూడవలె అయ్యగారి విభవముల్ అని సామెత! జగన్మోహన్ రెడ్డి వైభవం ఏమిటో, ఆయన మీద పార్టీ కేడర్ కు, నాయకులకు ఇన్నాళ్లూ రకరకాల స్తోత్రపాఠాలతో ఆయనను కీర్తించిన వారికి ఆయన మీద ఉన్న భక్తి ప్రపత్తులు ఏపాటివో ఇప్పుడు గమనించాలి. ఓడిపోవడం, అధికారానికి దూరం కావడం అనేది రాజకీయాల్లో పెద్ద విషయం కానేకాదు. కానీ.. 175 సీట్ల అసెంబ్లీలో 151 స్థానాలతో వైభవంగా కనిపించిన పార్టీ ఒకేసారి 11 స్థానాలకు పడిపోవడం అనేది చరిత్రలో నమోదు కాని సంగతి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి ఎంత విలువ ఉంటుందో ఊహించవచ్చు. ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది.
జగన్మోహన్ రెడ్డి పార్టీలో సేవలు అందించింది ఇక చాల్లెమ్మనుకుని ఒక్కొక్కరుగా బయటకు వెళుతున్నారు. రాజంపేట మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరడానికి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. మేడా మల్లికార్జున రెడ్డి గతంలో అదే పార్టీనుంచి వైసీపీలోకి వచ్చారు. ఆయనకు 2024లో జగన్ టికెట్ ఇవ్వలేదు. తీరా పార్టీ కూడా ఓడిపోయిన తర్వాత.. ఆయన పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే నెల్లూరు సిటీ మేయర్ కూడా తన పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులుగా కొనసాగబోతున్నట్టు ఆమె ప్రకటించారు. నిజానికి కోటంరెడ్డి ని వైసీపీ వెలివేసినప్పుడే ఆమె రాజీనామా చేశారు. అయితే వైసీపీ నాయకులు బెదిరించడంతో తిరిగి జగన్ మీదనే నమ్మకం ఉందంటూ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు జగన్ ప్రాభవం పతనం అయ్యాక కోటంరెడ్డి వెంట ఉంటానంటూ రాజీనామా చేశారు.
ఇవి కొన్ని శాంపిల్స్ మాత్రమేనని.. ఇంకా అనేకమంది నాయకులు వైసీపీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇదంతా గమనిస్తోంటే.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో జగన్ పితృసమానుడిగా భావించే కేసీఆర్ పార్టీ ఏ రకంగా పతనం అయిపోతున్నదో.. అదే బాటలో జగన్ కూడా పతనం అయిపోతున్నట్టుగా ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ లాగానే జగన్ కూడా అధికారంలో ఉన్నప్పుడు మితిమీరిన అహంకారంతో ప్రవర్తించారని, కేసీఆర్ కు శాస్తి చేసినట్టే జగన్ కు కూడా ప్రజలు శాస్తి చేసారని అంటున్నారు. వైసీపీ కూడా త్వరలోనే భారాసలాగా అంతర్ధానం అవుతుందని జోస్యం చెబుతున్నారు.
రాలుతున్న వికెట్లు: కేసీఆర్ బాటలో జగన్ ప్రాభవం!
Tuesday, November 5, 2024