గతంలో జగన్మోహన్ రెడ్డి ఏలుబడి సాగుతున్న రోజుల్లో జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలను ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థ అపహాస్యం పాలయ్యేలాగా అప్పట్లో ఎన్నికలు జరిగాయి. తిరుపతి పరిధిలో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు వేల సంఖ్యలో నకిలీ ఓటర్లు నమోదు కావడం చాలా పెద్ద వివాదంగా మారింది. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో మీడియా ప్రతినిధులు క్యూ లైన్లలో నిలుచున్న వారిని పలకరిస్తూ వారి విద్యార్హతల గురించి, ఆ ఎన్నికల గురించి అడిగితే అసలు బండారం మొత్తం బయటకు వచ్చింది. తాము ఎలిమెంటరీ స్కూలు చదువులు మాత్రమే చదివినట్టుగా చాలామంది టీవీ ఛానల్ రిపోర్టర్లతో చెప్పారు. అప్పుడు జరుగుతున్నది పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక అనే సంగతి కూడా వారికి తెలియదు అనే విషయం ఈ మీడియా ఇంటర్వ్యూలలో బయటకు వచ్చింది. కేవలం తమ పేర్లు ఓటర్లుగా నమోదయి ఉన్నాయని, తమకు ఓటు వేయడానికి డబ్బులు ఇచ్చి వెళ్లి వేయమన్నారు గనుక తాము వచ్చామని మాత్రమే వారు చెప్పారు. అంత ఘోరంగా ఎన్నికల ప్రక్రియను నవ్వుల పాలు చేసే లాగా నకిలీ ఓటర్లు తిరుపతి పరిధిలో నమోదు కావడం బయటపడడం జరిగింది.
నకిలీ ఓటర్ల వ్యవహారంలో కొందరు ఐఏఎస్ అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు. సుదీర్ఘకాలం పాటు విచారణ జరుగుతూనే ఉంది. ఆ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
అప్పట్లో ఆ పార్టీలో కింగ్ పిన్ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకు అప్పగించిన ప్రతి ఎన్నిక విషయంలోనూ నకిలీ ఓట్లను నమోదు చేయించడం, లేదా, లారీలలో మనుషులను తరలించి దొంగ ఓట్లు వేయించడం అనే రెండు పద్ధతుల ద్వారా మాత్రమే పార్టీకి వరుస విజయాలను కట్టబెట్టారు- అనేది సర్వత్రా వినిపించిన ఆరోపణ. తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరిగినప్పుడు గురుమూర్తి విజయం దాదాపుగా ఖరారే అయినప్పటికీ- లారీలలో వేలాదిమంది ఓటర్లను పుంగనూరు, పీలేరు ప్రాంతాల నుంచి తిరుపతికి తరలించి వారందరితో దొంగ ఓట్లు వేయించిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక జరిగినప్పుడు వేలమంది అనామకులను పట్టభద్రులుగా ఓటర్లుగా నమోదు చేయించి- ఏ స్థానానికి ఓటు వేస్తున్నామో కూడా తెలియని వారితో ఓట్లు వేయించి గెలిచిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఎన్నికలలో గెలవాలి అంటే వక్రమార్గాల ద్వారా మాత్రమే సాధ్యం అని నమ్మే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ- ఇప్పుడు జరగబోయే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచి తమ పార్టీ సత్తా ఏమిటో నిరూపించుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
రాష్ట్రంలో కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలకు రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు నకిలీ ఓటర్లను నమోదు చేయించడానికి అవకాశం దొరక్కపోవచ్చు. అసలు సిసలు ఓటర్లు మాత్రమే ఓటు వేసే పరిస్థితి ఉండవచ్చు. అందుకే కాబోలు అసలు పోటీ చేయాలా వద్దా అనే సంశయంలో ఇప్పటిదాకా అభ్యర్థి ఎంపికను కూడా పూర్తి చేయకుండా వైసిపి డోలాయమాన స్థితిలో ఉంది. తెలుగుదేశం ఒకవైపు రెండు స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించి ముందుకు దూసుకెళుతోంది. నకిలీలకు అవకాశం లేని ఎన్నికలను, పైగా బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగే ఎన్నికలను జగన్మోహన్ రెడ్డి ఎలా సద్వినియోగం చేసుకుంటారో ఎలా తన సత్తా నిరూపించుకుంటారో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
నకిలీ పట్టభద్రుల దందాలు ఈసారి నడవవు!
Sunday, December 22, 2024