మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి తాజా ట్వీట్ ను గమనిస్తే.. ఆమెలో మరీ ఇంత అజ్ఞానం ఉన్నదా? అనిపిస్తుంది. డిగ్రీ చదువుకున్న ఆమెకు కనీసం ఇంగ్లీషు కూడా అర్థం కాదా? అనే సందేహం కూడా కలుగుతుంది. అసెంబ్లీలో జరిగిన ఒక చర్చకు సంబంధించి.. డాక్యుమెంట్ ఇమేజి సహా రోజా ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. దానికి ముడిపెట్టి పవన్ కల్యాణ్ మీద నిందలు వేశారు. పవన్ మహిళల అక్రమ రవాణా గురించి గతంలో పచ్చి అబద్ధాలు చెప్పారని నిందలు వేశారు. ఈ పోస్టును, ఆ డాక్యుమెంట్ ను చూస్తే.. రోజాకు ఇంగ్లిషు అర్థం కాలేదని తెలిసిపోతుంది. లేదా.. ఆమె ఎక్స్ ఖాతా నిర్వహించే కూలీలు.. రోజా పరువు తీయడానికి కంకణం కట్టుకున్నారని అనిపిస్తుంది. అందుకే ఎక్స్ ఖాతా కూలీలను మార్చాలి రోజక్కా అని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
ఇంతకూ ఆ పోస్టు మహిళల అక్రమ రవాణా గురించి సాగింది. గతంలో గానీ, ఇప్పుడు గానీ.. పవన్ కల్యాణ్ ఒకే మాట అంటున్నారు. జగన్ కాలంలో 30వేల మందికి పైగా మహిళలు మిస్ అయ్యారనేది ఆయన ఆరోపణ.
రోజా ఆయనకు కౌంటర్ ఇవ్వదలచుకున్నారు. అసెంబ్లీ చర్చల డాక్యుమెంట్ లో వ్యభిచార గృహాల్లో గుర్తించిన వారు 46 మంది ఉన్నారని.. అలాంటివాటికి సంబంధించి 34 కేసులున్నాయని రాస్తే.. మొత్తం అయిదేళ్లలో 46 మంది మాత్రమే మిస్ అయినట్టుగా రోజా ప్రచారం చేస్తున్నారు. అదే డాక్యుమెంట్లో చాలా స్పష్టంగా అయిదేళ్లు పాలనలో రాష్ట్రంలో 54122 మంది మహిళలు,బాలికలు కలిపి మిస్సింగ్ అయినట్టుగా రికార్డులు పేర్కొన్నారు. వారిలో 16366 మంది 18ఏళ్లలోపు బాలికలే ఉన్నారని రాశారు. అంటే 38 వేల మంది దాకా మహిళలు మిస్సింగ్ అయినట్టే లెక్క. ఇది పూర్తిగా చదువుకోకుండా.. 46-34 అంకెలను మాత్రం ఎర్రసిరాతో సర్కిల్ చేసి మరీ.. ఆ డాక్యుమెంట్ ను రోజా ఎక్స్ ఖాతా నిర్వాహకులు షేర్ చేసి.. దానికి తగ్గట్టుగా కంటెంట్ వండి వార్చేశారు. రోజా ట్వీట్ వచ్చిందో లేదో.. జగన్మోహన్ రెడ్డి కరపత్రిక దాన్ని కళ్లద్దుకుని ‘పవన్ ఆత్మవిమర్శ చేసుకో.. ఇదీ అసలు నిజం’ అని రోజా హెచ్చరిస్తున్నట్టుగా వార్త కూడా అందించింది. ఈ దెబ్బతో రోజా పరువు పోతున్నది.
ఎక్స్ ఖాతా కూలీలను మార్చు రోజక్కా.. పరువుపోద్ది!
Saturday, January 18, 2025