జైలు శిక్షలు అమలు చేసే క్రమంలో సాలిటరీ సెల్ అనే పద్ధతి ఒకటి ఉంటుంది. జైలులో ఉంటూ ఏదైనా తప్పులు చేసిన వారికి అదనంగా దండన విధించాలనుకున్నప్పుడు గానీ.. ఒక ఖైదీకి ఇతరులనుంచి ఏదైనా ప్రమాదం ఉంటుందని అనుకున్నప్పుడు గానీ.. సాలిటరీ సెల్ లో ఉంచుతారు. అంటే, ఇతర ఖైదీలను కలవనివ్వకుండా ఒక సెల్ లో ప్రత్యేకంగా, ఒంటరిగా ఉంచుతారు. నిజానికి ఇలా ఒంటరిగా ఉండడం వలన ఖైదీలకు మానసిక, శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కానీ.. కొన్ని పరిస్థితుల్లో అది తప్పదు. ఇప్పుడు.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితి అలాగే ఉంది. ఆయనను భద్రత కారణాల దృష్ట్యా సెల్ లో ఒంటరిగా ఉంచారు.
అయితే.. ఒకడినే వద్ద.. నా సెల్ లో ఇంకా ఎవరైనా ఉండేలా అనుమతించండి మొర్రో అని ఆయన తొలినుంచి కోర్టుకు మొత్తుకుంటున్నారు. మంగళవారం విచారణలో.. వంశీకి విధించిన రిమాండును న్యాయమూర్తి పొడిగించారు. ఈ విచారణ సందర్భంగా వంశీ మరోసారి న్యాయమూర్తికి విన్నవించుకుంటూ.. తనకు కల్పించిన అదనపు వసతులు అన్నీ బాగానే ఉన్నాయి గానీ..తనకు ఒక తోడు కావాలంటూ మొరపెట్టుకోవడం గమనార్హం.
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో సూత్రధారి వల్లభనేని వంశీ, ఇతర నిందితులను పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. వంశీకి న్యాయమూర్తి ఏప్రిల్ 8 వరకు రిమాండు పొడిగించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వల్లభనేని వంశీకి జైలులో కల్పిస్తున్న వసతుల గురించి ప్రత్యేకంగా ప్రశ్నించారు. గతంలో జైలులో తాను చాలా ఇబ్బందులు పడుతున్నానని ఇనుప మంచం ఇచ్చారని, పరుపు దిండు కావాలని వల్లభనేని వంశీ కోర్టును కోరిన సంగతి తెలిసిందే. వాటిని న్యాయమూర్తి అనుమతించారు కూడా! ఆ నేపథ్యంలో వసతులు ఎలా ఉన్నాయని న్యాయమూర్తి ప్రశ్నించారు.
పరుపు, దిండు వరకు వసతులు బాగానే ఉన్నాయని చెప్పిన వల్లభనేని వంశీ.. సింగిల్ బ్యారెక్ లో ఉన్నందున చాలా ఇబ్బందిగా ఉందని.. వేరే బ్యారెక్ కు మార్చాలని, లేదా తన బ్యారెక్ లో తనతో పాటు మరొకరిని ఎవరినైనా ఉంచాలని వంశీ విన్నవించుకున్నారు. కనీసం తన మీద ఉన్న కేసులోనే తనతోపాటు రిమాండులో ఉన్నవారిలో ఒకరినైనా తనతో పాటు ఉండేలా అనుమతించాలని కోరారు.
ఇదే విషయాన్ని వంశీ గతంలో కూడా కోర్టును కోరారు. అయితే.. వంశీ మాజీ ఎమ్మెల్యే మరియు వైసీపీ కీలక నేత అయినందున భద్రత కారణాలదృష్ట్యా వేరే వారిని వంశీతో కలిపి ఉంచలేమని పోలీసులు గతంలోనే నివేదించారు.
పాపం.. వంశీ సౌకర్యార్థం జైలు అధికారులు సింగిల్ బ్యారెక్ సదుపాయం కల్పించినప్పటికీ.. ఆయనకు అది సాలిటరీ జైలు శిక్షలాగా అనిపిస్తున్నట్టుగా ఉంది. అందుకే ఆయన అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి గానీ.. తనకు ఓ తోడు కావాలని అభ్యర్థిస్తున్నారు. కానీ ఆ కోరిక కూడా తీరేలా లేదు.