అదానీ నుంచి ముడుపులు స్వీకరించిన వ్యవహారం రోజురోజుకూ తారస్థాయికి చేరుకుంటోంది. ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం… తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సుద్దపూస అని ప్రవచించుకుంటూ గడిపేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హాయిగా బెంగుళూరు యలహంక ప్యాలెస్ లో సేదతీరుతూ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో చోద్యం చూస్తూ ఉన్నారు. వైసీపీ  మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు కూడా  ఇప్పుడు ముక్తకంఠంతో వినిపిస్తున్న డిమాండ్ ఒక్కటే.‘ 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకుని రాష్ట్రాన్ని పణంగా పెట్టిన జగన్మోహన్ రెడ్డి మీద ఇక్కడే విచారణ జరగాలి’ అని! అన్ని పార్టీల నాయకులూ ఇదే మాట  మాట్లాడుతుండడమే విశేషం.

సీపీఐ నుంచి జాతీయ కార్యదర్శి నారాయణ అమెరికా పర్యటనలో ఉండగా అక్కడినుంచే వీడియో విడుదల చేసి మరీ జగన్ ను ప్రాసిక్యూటర్ చేయాలని డిమాండ్ చేయడం అందరికీ తెలుసు. అదే సమయంలో రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ కూడా ఇక్కడ అదే డిమాండ్లు వినిపిస్తున్నారు. ఆయన పలుదఫాలుగా ప్రెస్ మీట్లు పెట్టి.. అదానీతో జగన్ కుదుర్చుకున్న అవినీతి ఒప్పందాలను మొత్తంగా రద్దు చేయాలని అంటున్నారు.

అదే సమయంలో చాలా కాలం తర్వాత సీపీఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు కూడా తెరమీదకు వచ్చారు. అదానీ గ్రూపు నుంచి లంచాలు తీసుకున్న వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ఈడీ ప్రశ్నించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా విద్యుత్తు ఒప్పందాల రద్దు గురించే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అర్ధరాత్రి కుదిరిన చీకటి ఒప్పందాలు ఇవి అంటూ  ఆమె ఎగిరిపడుతున్నారు. అర్ధరాత్రి ఒంటిగంటకు తనకు ఫోనుచేసి సంతకాలు పెట్టమని చెప్పారంటూ బాలినేని వెల్లడించిన విషయాలను ఆమె గుర్తు చేస్తున్నారు. ప్రజలపై జగన్ లక్షన్నర కోట్ల భారం వేశారంటూ మండిపడుతున్నారు. అదానీ కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టాలని కూడా షర్మిల డిమాండ్ చేస్తున్నారు.సిటింగ్ జడ్జితో విచారణ జరగాలంటున్నారు.గంగవరం పోర్టును అదానీకి అప్పగించడాన్ని కూడా విచారించాలంటున్నారు.

తెలుగుదేశం, జనసేన పార్టీల సంగతి సరేసరి. యనమల రామక్రిష్ణుడు లాంటి సీనియర్ల నుంచి ఆనం వెంకట రమణారెడ్డి లాంటి దూకుడైన నాయకుల వరకు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని విచారించాలనే అంటున్నారు. ఇవన్నీ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు కాగా.. దేశంలో అయిదు రాష్ట్రాలకు లంచాలు ఇచ్చారనే మాట బయటకు వచ్చినందువల్ల.. అసలు అదానీ సెకి ఒప్పందాల విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసి దర్యాప్తు జరిపించాలనే డిమాండ్ తో జాతీయ స్థాయిలో రాజకీయాలు అట్టుడుకుతున్నాయి.

జాతీయ స్థాయి దర్యాప్తు మొదలైనా సరే.. మొట్టమొదటగా ఇరుక్కునేది జగన్మోహన్ రెడ్డే అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది. చంద్రబాబునాయుడు మీనమేషాలు లెక్కించకుండా.. వెంటనే జగన్ మీద విచారణకు ఆదేశించాలని పలువురు కోరుకుంటున్నారు.