బెయిలు వచ్చింది గానీ.. కేసు తప్పించుకోలేరు!

Monday, March 31, 2025

నిజానికి వారికి పెద్ద రిలీఫ్ దక్కింది గానీ.. అలాగని సంబరపడడానికి కూడా అవకాశం లేదు. సజ్జల తండ్రీకొడుకులకు హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది గానీ.. వారికి కేసుల బెడద మాత్రం తప్పేలా లేదు. ప్రస్తుతం బెయిలు మీద బయటకువ చ్చిన సినీనటుడు పోసాని కృష్ణమురళి ఈ తండ్రీకొడుకులు తెరవెనుకనుంచి నడిపే బాగోతాన్ని పోలీసుల విచారణలో తెలియజెప్పిన వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పేసిన సంగతి తెలిసిందే. ఆనాటినుంచి తండ్రీకొడుకులు ఇద్దరూ అరెస్టు భయంతో అల్లకల్లోలం అయిపోతున్నారు. పోలీసులు తమను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉన్నదనే భయంతో.. ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. మొత్తానికి హైకోర్టు సజ్జల రామక్రిష్ణారెడ్డి, ఆయన కొడుకు భార్గవరెడ్డికి ముందస్తు బెయిలు మంజూరు చేసింది. అయితే వారు పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని కూడా ఆదేశించింది.

జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో.. విచ్చలవిడిగా అసభ్య పోస్టులు పెడుతూ.. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్ ల గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి అసభ్యమైన భాషలో నిందలు వేసే ప్రెస్ మీట్లు పెడుతూ నటుడు పోసాని కృష్ణమురళి రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. గతంలో ఇలాంటి తప్పుడు పనులు చేసినవారిపై కొరడా ఝుళిపించిన వెంటనే.. ఆయన జాగ్రత్త పడ్డారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నానని.. జీవితంలో ఇంకెప్పుడూ రాజకీయాలు మాట్లాడనని నాటకీయంగా ఆయన ప్రకటించారు. అయినా బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదనే సామెత చందంగా ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నప్పటికీ.. చేసిన తప్పులు మాత్రం ఆయనను విడిచిపెట్టలేదు. వివిధ ప్రాంతాల్లో పోలీసులు కేసులు నమోదు చేయడంతో పోసాని అరెస్టు అయ్యారు. కడపజిల్లా ఓబుళాపురం పోలీసులు విచారించినప్పుడు.. తనకు సజ్జల రామక్రిష్ణారెడ్డినుంచి స్క్రిప్టు వచ్చేదని.. ఆ స్క్రిప్టులోనే సంగతులే తాను మాట్లాడానని వాంగ్మూలంలో చెప్పారు.

అలాగే సోషల్ మీడియా పోస్టులు కూడా సజ్జల భార్గవ రెడ్డి దగ్గరనుంచి వచ్చేవని ఆయన పోలీసులకు చెప్పారు. ఈ తండ్రీ కొడుకులకు అప్పటినుంచి అరెస్టు భయం పట్టుకుంది. మొత్తానికి ఇవాళ ముందస్తు బెయిలు పొందారు.
ముందస్తు బెయిలు అనేది కేసుల బెడద తప్పిపోయినట్టు కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బెయిలు ఉత్తర్వుల్లోనే వారు దర్యాప్తు కు సహకరించాలని కోర్టు సూచించింది. తండ్రీకొడుకులు ఇద్దరికీ కూడా బెడద తప్పినట్టు మాత్రం కాదు. ఎందుకంటే- కేవలం పోసాని కృష్ణమురళి మాత్రమే కాదు.. ఈ సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో అరెస్టు అవుతున్న ఇంకా పలువురు కూడా సజ్జల భార్గవ్ పేరే చెబుతున్నారు. తమ పోస్టులన్నింటికీ ఆయనే మూలకర్త అని అంటున్నారు. ఇప్పుడు కాకపోతే రేపు అయినా ఏదో ఒక కేసులో ఆయన చేసిన తప్పులకు అరెస్టు కాక తప్పదని ప్రజలంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles