అధికారంలోకి రాగానే సాధారణంగా చాలా మందికి కళ్లు నెత్తికెక్కుతాయి. కన్నూ మిన్నూ కానకుండా ప్రవర్తిస్తుంటారు. అలాంటి దుర్మార్గపు పరిపాలనలో పరాకాష్ట అనదగినట్టుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ఏపీ ప్రజలు రుచిచూశారు. ఇప్పుడు రోజులు మారాయి. ప్రజాందోళనల పట్ల పోలీసులు కాస్త దురుసుగా ప్రవర్తిస్తే ప్రభుత్వంలోని మంత్రి స్వయంగా మన్నించమని కోరుకునే ప్రజాస్వామిక ప్రభుత్వం ఉంది. అందుకే వారు ప్రతిపక్షాల నుంచి కూడా ప్రశంసలు అందుకోగలుగుతున్నారు. చంద్రబాబునాయుడు పర్యటనలు జనాల్ని ఇబ్బంది పెట్టకుండా, ప్రతిపక్షాల వారి పట్ల అణచివేత ధోరణి లేకుండా ఆదర్శమైన వాతావరణంలో జరగడాన్ని కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా అభినందిస్తున్నారు.
అనంతపురం జిల్లా మడకశిరలో చంద్రబాబునాయుడు గురువారం నాడు కార్యక్రమం నిర్వహించారు. గత అయిదేళ్ల పరిపాలన తరహాలో.. ప్రజల్ని, డ్వాక్రా మహిళల్ని బలవంతంగా తరలించే ప్రయత్నం ఈ సందర్భంగా జరగలేదు. తమ నిరసన తెలియజేయకుండా సీపీఎం నాయకుల్ని పోలీసులు నిర్బంధించే ప్రయత్నం చేస్తే.. ఆ వైఖరి పట్ల నారా లోకేష్ మన్నించాలని కోరారు. పోలీసులకు అలా నిర్బంధాలు అలవాటైపోయిందని, ఈ ప్రభుత్వంలో అలాంటివి ఉండవని ఆయన అన్నారు.
ఇప్పుడు బలవంతపు తరలింపులు లేకుండా, స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలతోనే చంద్రబాబు సభను సాదాసీదాగా నిర్వహించడాన్ని రఘువీరారెడ్డి ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినప్పటికీ.. కూటమి ప్రభుత్వాధినేతను అభినందించడం విశేషం. ఇన్నాళ్లూ జగన్మోహన్ రెడ్డి ఒక ఊరికి వెళ్లి సభ పెడుతున్నారంటే.. ఎన్ని రకాల ఆంక్షలు, ఎన్నిరకాల ప్రతిబంధకాల మధ్య ప్రజల జీవితం ఇబ్బందిపడేదో అందరికీ తెలుసు. చెట్లు నరికేసేవారు. రోడ్డు పక్కన బారికేడ్లు పెట్టి, పరదాలు కట్టేవారు. రోడ్డు పొడవునా దుకాణాలు మూయించేసేవారు. జగన్ వస్తున్నాడంటే అక్కడి ప్రజాజీవితం అతలాకుతలం అయ్యేది. అలాంటిది ఇప్పుడు చంద్రబాబునాయుడు పరిపాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తిని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నట్టుగా ఉంది. చంద్రబాబు తీరును అందరూ బహుధా శ్లాఘిస్తున్నారు.
విపక్షాలు కూడా ప్రశంసించే తీరు భేష్!
Tuesday, November 12, 2024