ఈ రోజుల్లో కొన్ని రకాల నేరాలను నిరూపించడానికి నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకోవడం అనేది దర్యాప్తులో ఒక కీలకమైన విషయంగా మారింది. ఒకసారి ఫోను దొరికిందంటే.. ఒకవేళ్ల వాళ్లు డేటా ఎరేజ్ చేసిఉన్నప్పటికీ కూడా దానిని రికవరీ చేయించి.. ఏయే సమయాల్లో ఎవరితో మాట్లాడారు. ఎంత సేపు మాట్లాడారు.. లాంటి వివరాలన్నీ తెలుసుకోవడం కుదురుతుంది. తద్వారా నేరం జరిగిన సమయంలో ఎవరెవరి మధ్య ఫోన్ కాల్స్ నడిచాయో సులువుగా తెలిసిపోతుంది. నేరంలో ఎవరెవరి పాత్ర ఉన్నదో చూచాయగా అర్థమైపోతుంది. అందుకని పోలీసులు పదేపదే నాయకులను మీ ఫోన్లు స్వాధీనం చేయాలని అడుగుతూ ఉండడం.. వారు ప్రతిసారీ ఫోన్లు ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉండడం జరుగుతుంటుంది.
చంద్రబాబునాయుడు నివాసం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి కేసుల్లో కూడా నాయకులనుంచి పోన్లు స్వాధీనం చేసుకుని విచారణను ముందుకు తీసుకువెళ్లడానికి పోలీసులు శతథా తమ ప్రయత్నాలు సాగించారు. కానీ, ఫలితం దక్కలేదు. ఈ కేసుల్లో నిందితులైన జోగి రమేశ్, తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ చివరకు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఏ ఒక్కరు కూడా పోలీసులు అడిగినప్పుడు తమ ఫోన్లు ఇవ్వడానికి నిరాకరించారు. అసలు ఫోన్లు అడిగే హక్కు పోలీసులకు లేదని వాదించారు. ఫోన్లు తమ వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినవి అని వాదించారు. ఇంకా తమాషా ఏంటంటే.. ఘటన జరిగిన తర్వాత తాము నాలుగైదు ఫోన్లు మార్చాం అని.. అప్పుడు వాడుతుండిన ఫోనును ఎవరికి ఇచ్చేశామో కూడా గుర్తులేదని వారందరూ దాదాపుగా ఒకటే స్క్రిప్టు ప్రకారం సమాధానాలు చెప్పారు.
అయితే తాజాగా తెలుస్తున్నదేంటంటే.. వారు ఫోన్లు ఇవ్వకపోయినా సరే.. నేర నిరూపణ పెద్ద సమస్య అయ్యే అవకాశం లేదు. ఈ నాయకులు తమ ఫోన్లు ఇవ్వకపోయినా.. వీరు ఎవరితోనైతే మాట్లాడి ఉంటారో.. వారి ఫోను దొరికినా చాలు.. ఈ నాయకుల బాగోతం బయటకు వస్తుంది. ఇప్పుడు అదే జరుగుతోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో విచ్చలవిడిగా చెలరేగిపోయిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్.. ఇన్నాళ్లుగా పరారీలో ఉన్నాడు. రెండు రోజుల కిందట గుంటూరు పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. అనిల్ కుమార్ విచారణలో వైసీపీకి చెందిన పలువురు పార్టీ పెద్దల పేర్లను వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన ఇంటిని సోదాచేసిన పోలీసులు.. అనిల్ ఫోను, లాప్ టాప్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. డేటా రికవరీ కోసం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ లకు పంపారు. బోరుగడ్డ అనిల్ ఫోను లో డేటా తీసుకున్నా సరే.. ఆయనతో తరచూమాట్లాడిన… తప్పుడు పనులను పురమాయించిన పెద్ద నాయకుల బాగోతాలు బయటకు వస్తాయి. పెద్ద నాయకులు తమ ఫోన్లను దాచి ఉంచుకున్నంత మాత్రాన వారి నేరాలు బయటకు రాకుండాపోవని ప్రజలు నమ్ముతున్నారు.
వారు ఫోన్లు ఇవ్వకపోయినా.. సాక్ష్యాలు దొరకడం ఈజీ!
Monday, November 18, 2024