సోషల్ ఇంజనీరింగ్ అనే ఒక అందమైన పదబంధాన్ని పదే పదే వాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జన సమూహాన్ని అచ్చంగా కులాల వారీగా విడగొట్టేసి కులాల ప్రాతిపదిక మీద మాత్రమే సీట్లు కేటాయిస్తూ తాను మళ్ళీ నెగ్గగలనని జగన్మోహన్ రెడ్డి తలపోశారు. సిటింగ్ ఎమ్మెల్యేలలో తన పార్టీకి చెందిన అనేకమంది ఎంతో అపకీర్తిని మూట కట్టుకున్నప్పటికీ, తాను సొంతంగా నియోజకవర్గాలలో చేయించుకున్న సర్వేలలో వారు గెలిచే అవకాశం లేదని నివేదికలు వచ్చినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి అలాంటి చాలామందిని అటూఇటూ ఇతర నియోజకవర్గాలకు మార్చారు. అంతేతప్ప పూర్తిగా పక్కనపెట్టి తన పార్టీ స్వచ్ఛమైన నాయకులకు ప్రజాదరణ పొందగల వారికి మాత్రమే పెద్దపీట వేస్తుంది అనే సంకేతాలు ఇవ్వలేకపోయారు.
ఒక నియోజకవర్గంలో పనికిరాడు అనుకున్న ఎమ్మెల్యేలను కేవలం కులాల లెక్కలతో వేరే నియోజకవర్గంలో పోటీ చేయించి రకరకాల ప్రయోగాలు చేశారు జగన్. తాను రెడ్డిని గనుక రెడ్డి సామాజిక వర్గం మొత్తంగా తన వెంటనే ఉంటుందని ఆయన ఊహించారు. తాను క్రిస్టియన్ కనుక ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ వర్గాలు అన్ని తనకు గంపగుత్తగా ఓట్లు వేస్తాయని జగన్ భ్రమపడ్డారు. అదే విధంగా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకున్న కారణం చేత ముస్లిములు ఎవ్వరూ కూటమి పార్టీలకు ఓట్లు వేయరని, అవి కూడా తన పార్టీకే లభిస్తాయని జగన్మోహన్ రెడ్డి ఆశపడ్డారు.
ఈ రకంగా జగన్ ఊహలు అంచనాలు ప్రయత్నాలు అన్నీ కూడా కేవలం కులాల ప్రాతిపదిక మీద మాత్రమే జరిగాయి. కానీ చివరికి ఏమైంది? యావత్తు రాష్ట్రంలో పార్టీ బొక్క బోర్లా పడింది! జగన్ ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారనే దానికి కనీసం ఒక్క ఉదాహరణ అయినా చెప్పుకోవాలి!
నరసరావుపేటలో లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంతో బలమైన సిటింగ్ ఎంపీగా ఉండగా పనిగట్టుకుని ఆయనను గుంటూరు నియోజకవర్గానికి అనవసరంగా మార్చాలని జగన్ అనుకున్నారు. నరసరావుపేట ఎంపీ పరిధిలోని తన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కట్టకట్టుకుని అధినాయకుడి వద్దకు వెళ్లి లావును మారిస్తే తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని విన్నవించుకున్నప్పటికీ ఆయన పట్టించుకోలేదు. నరసరావుపేట ఎంపీ పరిధిలో యాదవ సామాజిక వర్గం కొంత మెజారిటీ ఉన్నదని అభిప్రాయంతో నెల్లూరు నుంచి అక్కడ చెల్లని నాణ్యంగా పేరు తెచ్చుకున్న సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను ప్రత్యేకంగా తీసుకువచ్చి నరసరావుపేటలో ఎంపీగా పోటీ చేయించారు. అలా పోటీ చేయడానికి ఒప్పుకున్నందుకుగాను అనిల్ డిమాండ్ ను తీర్చవలసిన ఒత్తిడి జగన్ మీద పడింది. అందుకోసం అనిల్ అనుచరుడికి, గెలుస్తాడని నమ్మకం లేకపోయినా నెల్లూరు సిటీ టికెట్ ఇవ్వాల్సి వచ్చింది.
ఆ సిటీ ఎమ్మెల్యే టికెట్ను తాను సూచించిన అభ్యర్థికి ఇవ్వలేదని రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలక పూనారు. తాను ఎంపీగా పోటీ చేస్తున్న నియోజకవర్గ పరిధిలో కూడా ఎమ్మెల్యే టికెట్ల ఎంపికలో తన అభిప్రాయానికి విలువ లేకపోతే ఎలాగా అనేది ఆయన వాదన. జగన్ ఆయనను బుజ్జగించడంలో విఫలం కాగా, తనకు ఎంపీ టికెట్ ప్రకటించిన తర్వాత కూడా ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లి తెలుగుదేశంలో భార్యతో సహా చేరారు.
తీరా ఫలితాలు వచ్చేసరికి కేవలం కులాల కొలబద్దల మీద తీసుకువచ్చి పోటీ చేయించిన అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోయారు. లావు క్రిష్ణదేవరాయలు తమ పార్టీలో లేకపోతే గెలవడం కష్టం అని చెప్పిన ఆ ఎంపీ పరిధిలోని ఎమ్మెల్యేలందరూ ఓడిపోయారు. అనిల్ కోసం కేటాయించిన నెల్లూరు సిటీ స్థానం కూడా ఓడిపోయారు. అనిల్ కారణంగా అలిగి తెలుగుదేశం లోకి వెళ్లిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన భార్య ప్రశాంతి రెడ్డి ఇద్దరు మాత్రం గెలిచారు. ఏతావతా కేవలం కులాల కొలతల మీద అభ్యర్థులని ఎంపిక చేస్తూ దానికి సోషల్ ఇంజనీరింగ్ అని అందమైన పేరు పెట్టి ఓట్లు దండుకోవాలంటే జనం పట్టించుకోరు అనేది జగన్ నేర్చుకోవాలి. అధికారం దక్కినందుకు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళితే జనం హర్షిస్తారు గాని, వారికి డబ్బులు పంచడం.. వారి నడుమ కులాల గీతలు గీసి సమూహాలను వేరుచేసి దాని ద్వారా లబ్ధి పొందాలనుకోవడం వలన ఉపయోగం ఉండదని జగన్ గ్రహించాలి.
కులాల కుళ్లు గీతలు గీసినా ఫలం దక్కలేదు!
Thursday, November 14, 2024