ఏపీలో మొన్నమొన్నటిదాకా ముఖ్యమంత్రి తర్వాత అంతటి అధికారం తన చేతిలోనే ఉన్నట్టుగా చక్రంతిప్పిన వ్యక్తి, చెలరేగిపోయిన నాయకుడు, ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉంటూ డీఫ్యాక్టో ముఖ్యమంత్రిలాగా వ్యవహరించిన సజ్జల రామక్రిష్ణారెడ్డి తన పార్టీ నాయకులకు, కౌంటింగ్ ఏజంట్లకు చాలా హితోపదేశాలు చేశారు. కానీ కౌంటింగ్ మొదలైన కొన్ని గంటలకే ఆయన ఉపదేశాలన్నీ గాలికొ కొట్టుకుపోయాయి. కౌంటింగ్ మొదలైన తొలి అరగంట నుంచి కూడా.. తమ పార్టీ ఓడిపోబోతున్నట్టుగా ప్రతి ఒక్కరికీ అర్థమైపోయింది. కౌంటింగ్ ప్రారంభం అయిన రెండు మూడు గంటలకే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాలను వదలి ఇళ్లకు వెళ్లిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం కూడా వెలవెలబోయి కనిపించింది. కార్యకర్తలెవ్వరూ పార్టీ ఆఫీసులకు కూడా రాలేదు.
నిజానికి సజ్జల రామక్రిష్ణారెడ్డి తమ ఏజంట్లకు చాలా మాటలు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చివరి ఓటు లెక్క తేలే వరకు కౌంటింగ్ కేంద్రాలు వదలి బయటకు రావొద్దని ఆయన హితోపదేశం చేశారు. పైగా రూల్సు ఫాలో అయ్యే వాళ్లు తమకు ఏజంట్లుగా వద్దే వద్దని కూడా సజ్జల హింట్ ఇచ్చారు. తద్వారా కౌంటింగ్ కేంద్రాల వద్ద వీలైనంత రభస చేయాలని కూడా సజ్జల వారికి సూచించారు. నిజానికి కౌంటింగ్ కేంద్రాల వద్ద హింసాత్మక చర్యలకు పాల్పడడం, అవాంతరాలు సృష్టించడం ద్వారా బీభత్సం చేయాలని అనుకున్నారు.
కానీ, అలా విధ్వంసం చేయడానికి అవసరమైన ఉత్సాహం కూడా ఆ పార్టీ నాయకులకు లేకుండా పోయింది. తొలినుంచి ఎన్డీయే కూటమి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతుండడంతో వారు మన్నుతిన్న పాముల్లా ఉండిపోయారు. రెండు మూడు గంటలు గడిచేసరికి అనేక నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాలు వదలి వెళ్లిపోయారు. పాపం సజ్జల వారికి ఎంతగా గాలికొట్టి పంపించినా అంతా తుస్సుమనిపోయింది.
సజ్జల చెప్పినా సరే వారంతా పారిపోతున్నారంతే..!
Sunday, December 22, 2024