ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గ రాజకీయం ఈ సారి కాస్త ఆసక్తికరంగా కనిపిస్తోంది. రాష్ట్రమంతా ద్విముఖ పోటీగానే ఎన్నికల సమరాంగణంలో నేతలు తలపడుతుండగా.. చాలా అరుదుగా ఎమ్మెల్యే బరిలో త్రిముఖ పోటీ జరగబోతున్న నియోజకవర్గాల్లో చీరాల కూడా ఒకటి. ఇక్కడి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతూ ఉండడమే అందుకు కారణం. అయితే ఈ త్రిముఖ పోటీ ఎలా సాగినప్పటికీ.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా చీరాల రాజకీయం ఆసక్తికరంగానే సాగవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు.
చీరాలలో 2019లో తెలుగుదేశం తరఫున గెలిచిన సీనియర్ నాయకుడు కరణం బలరాం పార్టీ ఫిరాయించి వైఎస్సార్ కాంగ్రెసులో చేరారు. ఆయన వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ ను ఓడించారు. అప్పటినుంచి ఆమంచి -కరణం వర్గాల మధ్య ఆ నియోజకవర్గంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మద్యలో ఆమంచిని పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి చేసిన జగన్ అక్కడ కూడా టికెట్ ఇవ్వలేదు. కరణం బలరాం కొడుకు వెంకటేష్ కు మాత్రం చీరాలను అప్పగించారు.
దీంతో ఆమంచి కృష్ణమోహన్ పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఆయనకు ఆ నియోజకవర్గంలో సొంతంగా మంచి బలమే ఉంది. గతంలో సొంత పార్టీ స్థాపించుకుని ఆ పార్టీ తరఫున గెలిచిన అనుభవం ఆయనకు ఉంది. ఇప్పుడు కూడా గట్టిపోటీ ఇవ్వగలరు. గెలిచే అవకాశాన్ని కూడా తోసివేయలేమని పలువురు అంచనా వేస్తున్నారు. అయితే ఒకవేళ కాంగ్రెసు తరఫున గెలిచినా కూడా ఆ తర్వాత ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశంలో చేరే అవకాశం ఉన్నదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే- కాంగ్రెసులో చేరుతున్న విషయాన్ని ప్రకటిస్తున్న సందర్భంలోనే ఆమంచి.. తనకు చంద్రబాబు నాయుడు అంటే చాలా గౌరవం ఉన్నదని వెల్లడించారు. గతంలో తాను ఇండిపెండెంటుగా గెలిచినా తర్వాత అధికారంలో ఉన్న తెలుగుదేశంలో చేరిన రికార్డు ఆమంచికి ఉంది. ఈసారి తెలుగుదేశం అధికారంలోకి వస్తే అలాగే చేరవచ్చు. వైసీపీ అధికారంలోకి వచ్చినాసరే.. ఆమంచి గెలిచి ఆ పార్టీలో చేరలేరు. అక్కడ డోర్లు ఆయనకు మూసుకుపోయాయి. తెలుగుదేశంలో మాత్రమే చేరగలరు.. అనేది అంచనా. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెసు మోహరించిన ఎమ్మెల్యే అభ్యర్థుల్లో సొంతంగా ఓట్లు పొందగలిగిన కాస్త బలమైన నాయకుడు ఆమంచి మాత్రమేనని, ఆయన గెలిచినా పార్టీని వీడి తెలుగుదేశంలోకి వెళ్లవచ్చునని జనం అనుకుంటున్నారు.
కాంగ్రెస్ తరఫున గెలిచినా.. తెదేపాలోకి వస్తారేమో!
Thursday, November 21, 2024