జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో సమావేశం పెట్టుకున్న ప్రతిసారీ.. ఈక్షణంలో ఎన్నికలు వచ్చినా సరే మనమే గెలువబోతున్నాం. ప్రభుత్వం పట్ల అప్పుడే తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది అని కబుర్లు చెబుతూ ఉంటారు. పార్టీని పునర్నిర్మించడానికి చాలా చర్యలు తీసుకుంటున్నట్టుగా, కొత్త కమిటీలు వేస్తున్నట్టుగా, అన్ని కులాలకు, ప్రాంతాలకు వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా రంగులు పులుముతూ రోజుకొక ప్రకటనలు విడుదల చేస్తుంటారు. అయితే ఆచరణలో మాత్రం అంతా అందుకు భిన్నంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్ల నియామకం తర్వాత కార్యకర్తలు అలాగే పెదవి విరుస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఎన్నికలలో అత్యంత దారుణంగా ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పునర్ నిర్మించడం అనే ఎపిసోడ్ అత్యంత ప్రహసనప్రాయంగా జరుగుతూ వస్తున్నది. ఈ క్రమంలో ఆయన తీసుకుంటూన్న నిర్ణయాలు పార్టీ కార్యకర్తలకు నవ్వు తెప్పిస్తున్నాయి. ఎవరి వలన అయితే పార్టీ ఓడిపోయిందని నాలుగైదు నెలలుగా కార్యకర్తలు బలంగా నమ్ముతూ వస్తున్నారో, తిరిగి వారి చేతిలోనే నాయకత్వ బాధ్యతలు పెట్టాలనుకునే జగన్ ఆలోచనను కార్యకర్తలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఓడించిన సారథులకే మళ్లీ పగ్గాలు అప్పజెప్పి గెలవగలం అని ఎలా అనుకుంటారు? అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
రీజనల్ కోఆర్డినేటర్లుగా నియమించేప్పుడు ఉమ్మడి జిల్లాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. వీరిలో ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు విజయసాయిరెడ్డి, ఉభయగోదావరి జిల్లాలకు బొత్స సత్యేనారాయణ, కృష్ణా- అయోధ్యరామిరెడ్డి, గుంటూరు, చిత్తూరు జిల్లాలకు వైవీ సుబ్బారెడ్డి, ప్రకాశం- కారుమూరు నాగేశ్వరరావు, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, కడప, కర్నూలు జిల్లాలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లను నియమించారు. కొందరిని అటు ఇటు మార్చడం మినహా గతంలో కూడా పార్టీ పగ్గాలు వీరి చేతిలోనే ఉన్నాయి. వీరెవ్వరూ పార్టీని విజయపథం వైపు నడిపించలేకపోయారు. అలాంటిది వారి చేతికే మళ్లీ పగ్గాలు అప్పజెబితే ఎలా అని కార్యకర్తలు విస్తుపోతున్నారు.
జనగ్మోహన్ రెడ్డి ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నారని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అందుకనే కనీస ఆలోచన కూడా లేకుండా.. రీజనల్ కోఆర్డినేటర్ల నియామకం జరిగినదనే వ్యాఖ్యలు వస్తున్నాయి. ఈ సారథులతో ఆయన పార్టీని ఎలా ముందుకు తీసుకువెళతారో చూడాలి.
హవ్వ.. ఓడించిన సారథులకే మళ్లీ పగ్గాలు!
Monday, December 23, 2024