పరిస్థితులు తమకు అనుకూలంగా సాగినంత వరకు తమను మించిన వారు లేనేలేరంటూ అందరూ విర్రవీగుతుంటారు. పరిస్థితులు కొంచెం తేడా కాగానే.. కిందామీదా అయిపోతారు. కంగారుపడతారు. బయపడిపోతారు. ప్రతికూల పరిస్థితులలోనే చాలా మందిలోని పిరికితనం బయటపడుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పోటుగాళ్లు అనుకున్న అనేక మంది నాయకులు, వ్యక్తుల బాగోతంలో ఇప్పుడు ఇలాంటి పిరికితనమే కనిపిస్తోంది. వారి మీద కేసులు నమోదు కాగానే.. ఎక్కడివారక్కడ పరారై అజ్ఞాతంలోకి వెళ్లిపోయి తమ పిరికితనాన్ని చాటుకుంటున్నారు. బూతుల శ్రీరెడ్డిగా పేరుతెచ్చుకుని మాజీ సినీనటి, జగన్మోహన్ రెడ్డికి వీర ఫ్యాన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టు అయిన శ్రీరెడ్డికి ఉన్న ధైర్యం కూడా ఈ నాయకులకు లేదని ప్రజలు నవ్వుకుంటున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన కాలంలో నాయకులందరూ అడ్డగోలుగా అవినీతి, అరాచకాలతో రెచ్చిపోగా.. ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇంకో రకంగా రెచ్చిపోయారు. రాజకీయ ప్రత్యర్థుల మీద వారి కుటుంబాల్లోని మహిళల మీద వ్యక్తిత్వ హననంచేస్తూ అసభ్య బూతు పోస్టులతో చెలరేగిపోయారు. అలాంటి వారిలో నటి శ్రీరెడ్డి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె బూతులు మామూలు రేంజిలో ఉండేవి కాదు. వినడానికి కూడా భరించలేని బూతులను వాడేవారు.
కూటమి ప్రభుత్వం రాగానే ఇలాంటి వాళ్ల మీద కన్నెర్ర చేయడం మొదలైంది. కేసులు నమోదు అయ్యాయి. కొందరు అరెస్టు అయ్యారు. ఈలోగా అప్రమత్తమైన శ్రీరెడ్డి లాంటి వాళ్లు ముందుగానే లెంపలు వాయించుకుని, క్షమాపణలు కోరేసి జీవితంలో ఇంకెప్పుడూ అలాంటి తప్పుడు పోస్టులు పెట్టబోమని ప్రకటించుకున్నారు. అయినా ఆమె మీద కొన్నిచోట్ల కేసులు నమోదు అయ్యాయి. ట్విస్టు ఏంటంటే.. విచారణకు వెళితే.. అరెస్టు అయ్యే అవకాశం ఉన్నదని తెలిసి కూడా శ్రీరెడ్డి నిర్భయంగా విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీసు స్టేషనుకు విచారణకు హాజరయ్యారు. అనకాపల్లి స్టేషనుకు కూడా హాజరయ్యారు.
వైసీపీలో కొమ్ములు తిరిగిన నాయకులుగా పేరున్నవారు, తెరవెనుక పోటుగాళ్లుగా పేరున్నవారు అందరూ పోలీసు విచారణ అంటేనే వణికి పరారవుతున్నారు. పోలీసులు బట్టలూడదీయిస్తానని అన్న కాకాణి గోవర్దనరెడ్డి నోటీసులు రాగానే కుటుంబం సహా పరారయ్యారు. లిక్కర్ స్కాములో వేల కోట్లు కాజేసిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి.. భార్య మరదలుతోసహా మాయం అయ్యారు. ఇలా అనేక మంది కీలక నాయకులు పరారీలోనే ఉన్నారు. ఇలాంటి వారికి కనీసం శ్రీరెడ్డికి ఉన్నంత దైర్యం కూడా లేదని ప్రజలు నవ్వుకుంటున్నారు. పారిపోయినంత మాత్రాన అరెస్టు తప్పించుకోలేరు అని.. విచారణకు హాజరైతే వ్యవహారం వెంటనే తేలిపోతుంది కదా అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
బూతుల శ్రీరెడ్డికి ఉన్న ధైర్యం ఆ నేతలకు లేదా?
Friday, December 5, 2025
