ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి ఒక దఫా అధికారంలోకి కూడా తీసుకువచ్చిన నాయకుడు.. అవసరానికంటె ఎక్కువ సంకుచితమైన ఆలోచనలతో పార్టీని నడిపిస్తున్నారా అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. ప్రజాదరణ పొందడానికి నాయకులు కొన్ని డ్రామాలు, నాటకాలు ఆడడం.. ప్రజలను మభ్యపెట్టి తమను మహానుభావులుగా ప్రొజెక్టు చేసుకోవడం గానీ, తమ మీద జాలి పుట్టేలా చేసుకోవడం గానీ రాజకీయాల్లో మామూలే! అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి టెక్నిక్కులనే కాస్త చవకబారుగా ప్రయోగిస్తున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు.
వైఎస్ జగన్ తొలినుంచి ఏదో ఒక చిల్లర విషయాన్ని పట్టుకుని దాని ద్వారా ప్రజల్లో విపరీతమైన జాలి, రాజకీయ లబ్ధి పొందడానికి కుటిల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారనే అభిప్రాయమే తాజాగా హెలికాప్టర్ సంగతి, పాపిరెడ్డి పల్లెలో భద్రత ఏర్పాట్లపై విమర్శలను గమనిస్తున్న ప్రజలకు కలుగుతోంది. జగన్ ది తొలినుంచి ఇదేపద్ధతి అని అంటున్నారు.
2019 ఎన్నికలకు పూర్వం విశాఖపట్నం కేంద్రంగా కోడికత్తి డ్రామా నడిపించారు. కోడికత్తి దెబ్బలకు దారుణంగా జరిగే కోళ్లపందేల్లో కోళ్లు చావడమే అరుదు. చాలా దెబ్బలు తగిలితే తప్ప ఆ కత్తికి కోడి చనిపోవడం జరగదు. అలాంటిది కోడికత్తితో ఒక గాటు పెడితే.. హత్యాయత్నం జరిగిందని, అది తెలుగుదేశం వారే చేయించారని.. ఏపీలో ఆస్పత్రిలో చేరినా కూడా తనను చంపేస్తారు కాబట్టి నమ్మకం లేదని, హైదరాబాదు వచ్చి చికిత్స చేయించుకున్న ఘనుడు జగన్మోహన్ రెడ్డి.
2024 ఎన్నికలు వచ్చేసరికి చీకట్లో ఎవరో ఆకతాయి రాయి విసిరితే.. దానిని కూడా హత్యాయత్నం కింద ప్రచారం చేసుకున్నారు. తెలుగుదేశం లింకు ఉన్న ఒక అమాయక కుర్రవాడిని పట్టుకొచ్చి ఇరికించడానికి ప్రయత్నించారు. తెలుగుదేశం వాళ్లేచేయించినట్టుగా చెప్పించాలని తపన పడ్డారు. చిన్న గులకరాయి తగలడం వల్ల ఏర్పడిన చిన్న గాయం.. కాస్త పసుపు పెట్టి ఉంటే రెండు రోజులకు తగ్గిపోతుంది. జగన్మోహన్ రెడ్డి.. లోపల గాయం ఉందో మానిందో కూడా ప్రజలకు అర్థం కాకుండా రెండు వారాల పాటు నుదుటికి పెద్ద ప్లాస్టరు వేసుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ.. తనమీద హత్యాయత్నం చేశారని చెప్పుకుంటూ జాలి పొందే ప్రయత్నం చేశారు. ప్రజలు మాత్రం ఆ వేషాలకు నవ్వుకుని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు.
ఆ రెండు ఇప్పుడిక హెలికాప్టర్ డ్రామా షురూ అయింది. జగన్ కార్యక్రమానికి రావాలని ఆ పార్టీ వాళ్లే జనానికి డబ్బులిచ్చి, తాగించి తోలించి తీసుకువస్తారు. వాళ్లే విరగబడి వాహనాల మీదికి ఎగబడతారు. వారిని పోలీసులు లాఠీచార్జి చేసి కంట్రోలు చేస్తే గనుక.. మా పార్టీ వాళ్లను చంపేస్తున్నారని గోలచేస్తారు. వారిలా ప్రవర్తించడం వలన హెలికాప్టర్ కు చిన్న దెబ్బతగిలితే.. మళ్లీ జగన్ ను చంపేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదంటూ కొత్త పాట ప్రారంభిస్తున్నారు.
జగన్ ఈ హెలికాప్టర్ డ్రామా ద్వారా తన ఇమేజి బాగా పెరిగిపోతుందని, ప్రజల్లో తన మీద జాలి కొండంత పుడుతుందని అనుకున్నట్టుంది. అందుకే పదేపదే అందరితోనూ అదే టాపిక్ మాట్లాడిస్తున్నారు. అయితే జనం మాత్రం ఈ విమర్శలు చూసి నవ్వుకుంటున్నారని వారికి అర్థం కావడం లేదు.
ఈ డ్రామా రాద్ధాంతాలను జనం ఛీ కొట్టరా?
Wednesday, December 10, 2025
