ఏదైనా ఒక కేసులో నిందితులను పోలీసులు విచారణకు పిలిచినప్పుడు.. వారు ఆ నోటీసులు తీసుకోకుండా, స్పందించకుండా ఉంటేగానీ, అజ్ఞాతంలోకి వెళ్లిపోయినా గానీ.. వారికి నేరంత సంబంధం ఉన్నదేమో అందుకే పారిపోతున్నారు.. అని భావించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో.. ఏదైనా ఒక కేసులో సాక్షిగా విచారణకు రావాలని పిలిచినా కూడా.. నాటకాలాడితే, పిలిచినప్పుడు రాకుండా గైర్హాజరైతే.. నోటీసులను ఏమాత్రం పట్టించుకోకుండా పదేపదే గడువులు కోరుతూ వాయిదా వేస్తూ కాలహరణం చేస్తే.. ఏమనిపిస్తుంది? దాల్ మే కుఛ్ కాలా హై అని అనిపిస్తుందా? లేదా? ఏ తప్పు చేసిన భయమూ లేనప్పుడు.. సాక్షిగా విచారణకు హాజరు కావడానికి కూడా ఇన్ని నాటకాలు ఎందుకాడుతున్నారని అనుమానం పుడుతుందా? లేదా? ఇప్పుడు పాపిరెడ్డిగారిపల్లె హెలిప్యాడ్ సంఘటనకు సంబంధించి ఇదే పరిస్థితి ఏర్పడుతోంది. జగన్ ప్రయాణించవలసి ఉన్న హెలికాప్టర్, వైసీపీ కార్యకర్తల తోపులాటలో దెబ్బతిన్న విషయంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు.
హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిన్న తర్వాత.. జగన్ ను అందులో తీసుకువెళ్లడం సాధ్యం కాదని పైలట్ తేల్చి చెప్పారు. దీంతో జగన్ రోడ్డు మార్గంలో బెంగుళూరుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ దెబ్బతినడానికి పోలీసులు కారణం అని, వైసీపీ మూకలను నియంత్రించలేదని, రోడ్డు మార్గంలో జగన్ ప్రయాణించే పరిస్థితి సృష్టించి మార్గమధ్యంలో హత్య చేయడానికి కుట్ర జరిగిందని వైసీపీ నాయకులు నీచమైన నిరాధారమైన ఆరోపణలు పదేపదే చేశారు. కానీ జగన్ వెళ్లిన కాసేపటికే హెలికాప్టర్ ఎంచక్కా గాల్లోకి ఎగిరి బెంగుళూరు వెళ్లిపోయింది. ఈ ఎపిసోడ్ పై హెలిప్యాడ్ వద్ద వాస్తవంగా ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పైలట్ కో పైలట్ లకు సాక్షులుగా వచ్చి వివరాలు చెప్పాలని నోటీసులు ఇచ్చారు.
కోపైల్ రాజేశ్ జైన్ తన న్యాయవాదితో కలిసి వచ్చి విచారణకు హాజరయ్యారు. వివరాలు చెప్పి వెళ్లారు. కానీ.. అసలు పైలట్ అనిల్ కుమార్ మాత్రం ఇప్పటిదాకా రాలేదు. ఆయనకు గతంలోనే మూడుసార్లు నోటీసులు ఇవ్వగా.. ప్రతిసారీ ఏదో ఒక సాకు చెప్పి ఎగ్గొట్టారు. తనకు గడువు కావాలని కోరుతూ వచ్చారు. తాజాగా ఆయనకు నాలుగోసారి నోటీసులు ఇచ్చారు. జూన్ 10 న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పైలట్ ఇన్నిసార్లు విచారణకు గైర్హాజరవుతుండగా.. ఆయన మీద జగన్ దళాల ఒత్తిడి ఉన్నదేమో అని.. హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినే పరిస్థితులకే వైసీపీ వారి ప్రవర్తనే కారణమనే మాట ఆయన నుంచి పోలీసులకు చేరకుండా వారు ఒత్తిడి చేస్తున్నారేమోనని, జగన్ కళ్లలో ఆనందం చూడడానికి అనిల్ ఆరోజున డ్రామా నడిపించారేమోనని అనేక రకాల అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి. ఆయన విచారణకు హాజరైతే తప్ప.. ఇవి నివృత్తి కావని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇన్నిసార్లు గైర్హాజరీ అనుమానాలను పెంచదా?
Friday, December 5, 2025
