11 సీట్ల పరిమితమైన పార్టీని తిరిగే అధికారంలోకి తీసుకురావాలంటే ఏం చేయాలో అర్థం కాని స్థితిలో గందరగోళంగా ఉంటున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ నాయకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పార్టీ పునరుత్థానం పేరుతో ఆయన నిరంతరం కీలక బాధ్యతలలోని నాయకులను పదేపదే మారుస్తూ ముందుకు సాగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు గమనిస్తే ఆయన మట్టి గుర్రాలను నమ్ముకుని యేరు దాటాలనుకుంటున్నారా అనే అనుమానం పార్టీ నాయకులకు కలుగుతోంది. పార్టీకి ఉండే ఓటు బ్యాంకుకు తమ బలాన్ని జోడించలేని నాయకుల పై ఆధారపడడం పార్టీకి ఎప్పటికీ శ్రేయస్కరం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. శింగనమల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఒకప్పట్లో సారథిగా పనిచేసిన మాజీ మంత్రి సాకే శైలజానాధ్ ను ఇప్పుడు పార్టీ ఇన్చార్జిగా నియమించడం అనేది పలువురికి ఆశ్చర్యం కలిగిస్తోంది.
శింగనమల నియోజకవర్గంలో 2019లో వైసీపీ నెగ్గింది. ఆ పార్టీ తరఫున జొన్నలగడ్డ పద్మావతి ఏకంగా 46 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2024 నాటికి అక్కడ పరిస్థితిలో మార్పు వచ్చింది. అయిదేళ్ల పాటు జగన్ పాలన చూసిన ప్రజలు రాష్ట్రమంతా వ్యతిరేకత పెంచుకున్నట్టే అక్కడ కూడా జరిగింది. అయితే సర్వేల్లో ప్రజా వ్యతిరేకతను మాత్రం గుర్తించి, ఆ వ్యతిరేకత తన మీదనే అనే సంగతి మాత్రం గమనించలేకపోయిన జగన్మోహన్ రెడ్డి.. అక్కడ అభ్యర్థిని మార్చేశారు. ఆ ఎన్నికల్లో వీరాంజనేయులును బరిలోకి దించారు. ఆయన తెలుగుదేశం అభ్యర్థఇ బండారు శ్రావణి శ్రీ చేతిలో ఓడిపోయారు. రాష్ట్రమంతా జగన్ మీద అసంతృప్తి వెల్లువెత్తినా కూడా.. వీరాంజనేయులు కేవలం 8788 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే నియోజకవర్గానికి సాకే శైలజానాధ్ ను ఇన్చార్జిగా నియమించారు.
సాకే శైలజనాథ్ శింగనమల నియోజకవర్గంలో 2024 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సాధించిన ఓట్లు 3469 మాత్రమే! నియోజకవర్గవ్యాప్తంగా సాంప్రదాయంగా హస్తం గుర్తుకు మాత్రమే వేసే ఓటు బ్యాంకు కనీసం 3,000 మంది అయినా ఉంటారని అనుకుంటే.. తన వ్యక్తిగత ఇమేజీతో సాకే శైలజానాధ్ సంపాదించుకున్న ఓట్లు 500 కూడా లేవని గుర్తించాలి. అలాంటి సాకే శైలాజానాధ్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి, వేరే గత్యంతరం లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని మాత్రమే కాకుండా, పీసీసీ సారథిగా ఉన్న షర్మిలను కూడా నిందించడానికి వైసీపీకి బాగా ఉపయోగపడుతున్నారు. చెల్లెలిని ప్రెస్ మీట్లలో తిట్టగల నేత దొరికినందుకు సంతోషించారేమో.. శైలాజానాధ్ కు నియోజకవర్గం అప్పగించేశారు జగన్. సొంత బలం లేని ఇలాంటి మట్టి గుర్రాలతో జగన్ యేరు దాటాలనుకుంటే అది సాధ్యమవుతుందా? అని ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు.
జగన్ మట్టి గుర్రాలతో ఏరు దాటాలనుకుంటున్నారా?
Friday, December 5, 2025
