పార్టీ ఆవిర్భవించినప్పటికి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జగన్ తన దుకాణం మూసేసి చాలా కాలం అయింది. పేరుకు జాతీయ పార్టీ అని ప్రకటించుకుంటూ, తమ పోస్టులకు ముందు ‘జాతీయ’ అనే మాటను తగిలించుకుంటూ తిరుగుతూ ఉంటారు. కానీ.. తెలంగాణలో కనీసం పార్టీ కమిటీ గానీ, కార్యకలాపాలు గానీ కనిపించవు. అయినా సరే.. జగన్మోహన్ రెడ్డి తనను తాను జాతీయ స్థాయి నేతగా ఊహించుకుంటున్నట్టుగా ఆయన మాటలు కనిపిస్తున్నాయి. ఇచ్ఛాపురంలో ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తూ ప్రజలందరూ వైసీపీకి ఓటు వేయాలని.. ఇక్కడ ఓటు వేస్తే ఢిల్లీ పీఠం కదలాలని, మోడీ సర్కారును ఓడించాలని పిలుపు ఇస్తున్నారు.
తాను ఇచ్చాపురంలో పిలుపు ఇవ్వగానే.. దేశంలోని ప్రజలందరూ తన మాటలకు స్పందించి.. బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని జగన్మోహన్ రెడ్డి భ్రమిస్తున్నారేమో తెలియదు. మోడీని పల్లెత్తు మాట అనడానికి వణికిపోయే జగన్మోహన్ రెడ్డి.. ఢిల్లీ పీఠం కదలాలి అని పిలుపు ఇస్తున్నారంటే.. దాని వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా.. చంద్రబాబునాయుడుకు ఢిల్లీ పెద్దలు సహకరిస్తున్నారట. ఇంతకూ చంద్రబాబు ఏం చేయడానికి ఢిల్లీపెద్దలు సహకరిస్తున్నారని జగన్ బురద చల్లుతున్నారో తెలుసా? ఆయన బటన్ నొక్కిన పథకాల డబ్బులు ప్రజలకు అందకుండా కుట్ర చేస్తున్నారట.
జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ఎన్నికల కోడ్ రావడానికి కొన్ని వారాల ముందు విద్యార్థులకు ఫీజు రీఇంబర్స్ మెంటు, రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించే బటన్లు నొక్కారు. ఇలా నొక్కితే అలా మీ అకౌంట్లలోకి వచ్చేస్తాయని అంటూ ఉంటారు గానీ.. నెలన్నర రెండు నెలలు గడిచినా ఎవరి అకౌంట్లలోకి కూడా రూపాయి కూడా రాలేదు. తీరా పోలింగ్ ఇంకో వారం రోజులు ఉండగా ఇప్పుడు డ్రామా ప్రారంభించారు. నిధులు వారి అకౌంట్లలో వేయడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఈసీని కోరడం.. ఎన్నికలు సమీపంలో ఉన్నందున..ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత నిధులు విడుదల చేయాలని ఈసీ అడ్డు చెప్పడం జరిగింది. బటన్ నొక్కి నెలన్నర దాటినా మౌనంగా కూర్చుని నాటకాలు ఆడిన జగన్.. ఇప్పుడు ఇంకొక్క వారం రోజులు ఆలస్యం అవుతూందంటే.. ప్రతిపక్షాలను నిందించడానికి సాహసిస్తున్నారు. చంద్రబాబునాయుడు కుట్రచేసి డబ్బు పడకుండా చేస్తున్నారని సభల్లో అంటున్నారు. ఆ కుట్రలకు ఢిల్లీ పెద్దలు సహకరిస్తున్నారట. కాబట్టి ఢిల్లీపీఠం కదిలేలా ఓటు వేయాలిట. దేశాన్నంతా ప్రభావితం చేసే నాయకుడి స్థాయిలో జగన్ మాటలు వల్లిస్తుండడం జనానికి నవ్వు తెప్పిస్తోంది.
జగన్ తాను జాతీయనేత అనుకుంటున్నారా?
Wednesday, January 22, 2025