తండ్రి వైఎస్ఆర్‌పై షర్మిలకున్న ప్రేమ జగన్‌కు లేదా?

Friday, December 5, 2025

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ఆయన కొడుకు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రేమ అంతంత మాత్రమేనా? ప్రజల్లో వైయస్సార్ కు ఉన్న అభిమానాన్ని, ఆదరణను తన రాజకీయ స్వార్థం కోసం సోపానాలుగా వాడుకోవడం తప్ప, వైఎస్ పట్ల వాస్తవమైన గౌరవం జగన్ లో లేదా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ఒక చిన్న వైఎస్ విగ్రహాన్ని అక్కడ పెట్టించి మెడలో ఒక పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం  అనేది కేవలం పార్టీ కార్యకర్తలను, నాయకులను మభ్యపెట్టడానికి మాత్రమేనా? అనే రకరకాల ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో రేకెత్తుతున్నాయి. ఎందుకంటే నందిగామలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగిస్తే జగన్మోహన్ రెడ్డి గాని,  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని కిమ్మనకుండా మౌనం పాటించడమే అందుకు నిదర్శనం!

ఆ మాటకొస్తే వైయస్ రాజశేఖర్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా కూతురు షర్మిల లోనే ప్రేమాభిమానాలు ఉన్నట్లుగా కనిపిస్తోందని ప్రజలు భావిస్తున్నారు. నందిగామలో వైఎస్ విగ్రహం తొలగింపు గురించి షర్మిల గట్టిగానే గళం విప్పుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కోపాన్ని కూటమి ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి మీద చూపించకూడదు అని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కూడా షర్మిల నొక్కివక్కాణిస్తున్నారు.
నందిగామలో గాంధీ సెంటర్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహం ఒక ఎత్తైతే దాని చుట్టూ వైసిపి అడ్డా లాగా మార్చుకుంటూ ఆ పార్టీ వారు వేసుకున్న సెట్టింగులు కంపరం పుట్టించే విధంగా తయారయ్యాయి. ఆ నేపధ్యంలోనే అధికారులు ఏకంగా విగ్రహాన్ని తొలగించారు. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డిని తమ మనిషిగా క్లెయిం చేసుకోవడానికి వైసిపి వారు చేసే ఇలాంటి సెట్టింగుల ప్రయత్నాలను తొలగించవచ్చు గాని, విగ్రహాన్ని తొలగించడం సబబు కాదని షర్మిల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదంతా ఒక ఎత్తైతే జగన్మోహన్ రెడ్డి దీని గురించి అస్సలు నోరు మెదపకపోవడం గమనార్హం. కనీసం ఆయన పార్టీలోని ఏ నాయకుడు కూడా ఈ విషయం గురించి సీరియస్ గా స్పందించడం లేదు. వైఎస్ విగ్రహాన్ని తీసి పారేస్తే తమకు వచ్చిన నష్టమేముందిలే అన్నట్టుగా ప్రతివారు వ్యవహరిస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డికి భద్రత లేదని, ఆయన యాత్రలకు ఆటంకాలు కలిగిస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు రక్షణ కావాలని, ఆయన అడుగు బయట పెడితే రోప్ పార్టీ పట్టుకుని పరుగులు తీసే పోలీసులు హంగామా కావాలని తరచుగా డిమాండ్లు వినిపిస్తూ ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరూ కూడా తమ పార్టీకి మూలవిరాట్ అయిన వైయస్సార్ విగ్రహం విషయంలో నిర్లిప్తత వహించడం చర్చనీయాంశంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలను మభ్యపెట్టడానికి తన 2.0 ప్రభుత్వం వచ్చాక అన్ని సెట్ చేస్తా అన్నట్టుగా, తండ్రి విగ్రహం తొలగింపు విషయంలో కూడా అర్థంపర్థం లేని మౌనం పాటిస్తున్నారా అని ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles