మోహన్ బాబు కున్న విజ్ఞత జగన్ కు లేదా?

Tuesday, December 9, 2025

రాజకీయాల్లో మాత్రమే కాదు.. సెలబ్రిటీల జీవితాల్లో అనుకోకుండా జరిగే పొరబాట్లు అనేకం ఉంటాయి. కొన్ని సంఘటనలు చాలా దారుణంగా మారుతూ ఉంటాయి కూడా. అయితే తమ కారణంగా తప్పులు జరిగినప్పుడు.. వాటిపట్ల ఆయా సెలబ్రిటీలు ఎలా స్పందించారు అనేదాని మీద వారి స్థాయి, బుద్ధి ఆధారపడి ఉంటుంది. ఆ రకంగా చూసినప్పుడు.. కనీసం మోహన్ బాబుకు ఉన్న విజ్ఞత, అల్లు అర్జున్ కు ఉన్న మంచితనంలో పదో వంతు అయినా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో లేకుండా పోయాయే అని తెలుగు ప్రజలు ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. కేవలం పోలీసులను ధిక్కరించి తన అహంకారం ప్రదర్శించుకోవడం కోసం.. రెంటపాళ్లకు బీభత్సమైన రోడ్ షో గా యాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి.. తన కారుకింద బలితీసుకున్న సింగయ్య కుటుంబాన్ని పరామర్శించకపోవడం, కనీసం సానుభూతికూడా వ్యక్తం చేయకపోవడం ఆయనలోని దుర్మార్గ వైఖరికి పరాకాష్ట అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మోహన్ బాబు విషయంలో ఇలాంటిదే ఒక సంఘటన జరిగింది. ఆయన కుటుంబంలో అన్నదమ్ముళ్ల తగాదాలు జరుగుతున్న సమయంలో.. మోహన్ బాబు ఇంటిమీదికి మీడియా వాళ్లందరూ దూసుకెళ్లారు. ఆ సందర్భంలో ఆయన ఒకరి మైకు లాక్కుని అతడిమీదికి విసరడం జరిగింది. ఈ ఘటనలో మీడియా విలేకరి గాయపడ్డాడు. ఆ చానెల్ మోహన్ బాబు మీద దాదాపుగా యుద్ధం ప్రకటించింది. ఆయన దుష్టుడంటూ అనేక బులెటిన్లు ప్రసారం చేసింది. ఇంత జరిగినప్పటికీ.. ఆ సమయానికి ఆస్పత్రిలో ఉన్న మోహన్ బాబు.. తాను డిశ్చార్జి అయిన వెంటనే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సదరు విలేకరి వద్దకు వెళ్లి పలకరించారు. కుశలం అడిగారు. సారీ చెప్పారు. అలా జరిగి ఉండాల్సింది కాదన్నారు. తానే దాడిచేసిన తర్వాత.. అక్కడకు వెళ్తే ప్రతిఘటన ఉంటుందని తెలిసినప్పటికీ.. మోహన్ బాబు ఆ పని చేశారు.

సంధ్య థియేటర్ వివాదంలో అల్లు అర్జున్ పాత్ర తక్కువ. కానీ.. ఆయన వాహనంలో థియేటర్ కు వెళ్లకుండా.. కారులో పైకి లేచి అభివాదం చేసినందుకే తొక్కిసలాట జరిగిందని చెప్పి.. ఒక మహిళ చనిపోయినందుకు పోలీసులు కేసు పెట్టారు. ఆయన కోర్టు, పోలీసు స్టేషను చుట్టూ పదేపదే తిరిగారు. స్టేషనుకు వెళ్లిన ప్రతిసారీ తన అభిమానులు ఎవ్వరూ అక్కడకు రావద్దని పదేపదే వేడుకుని మరీ వెళ్లారు. ఈ సంస్కారం ఒక ఎత్తు కాగా, మరణించిన మహిళ, గాయపడిన బాలుడి కుటుంబానికి భారీగా ఆర్థిక సహాయం కూడా చేశారు. తన ప్రమేయం లేకపోయినా.. వారు నష్టపోయినందుకు ఆయన బాధ్యత తీసుకున్నారు.

కానీ జగన్మోహన్ రెడ్డిలో అలాంటి మానవత్వం, సంస్కారం మచ్చుకైనా కనిపించడం లేదు. తాను ప్రయాణిస్తున్న కారు కింద తన అభిమాని అయిన దళిత వృద్ధుడు పడి మరణిస్తే.. జగన్ నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. ఆయన కారు కిందనే పడి చనిపోయినట్టు ఫోరెన్సిక్ నివేదిక కూడా తేల్చింది. జగన్ మాత్రం.. బుకాయిస్తూ.. తన పార్టీ వారే అయినా కనీసం వారిని పరామర్శించకుండా తన బుద్ధి చూపించుకున్నారని ఆ పార్టీ వారే అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles