అమరావతి- ఈ పదం మాజీ ముఖ్యమంత్రికి ఒక పీడకల లాంటిది కావొచ్చు. ఎందుకంటే.
అమరావతి- అనే పదంతో ఆయన అనేక ఆటలు ఆడుకున్నారు. ప్రజలను మోుసం చేయడానికి, బురిడీ కొట్టించడానికి, మభ్యపెట్టడానికి ఆ పదాన్ని ఒక పావులాగా ఆయన వాడుకున్నారు. తన పబ్బం గడిచిన తర్వాత.. అదే అమరావతిని స్మశానం చేయడానికి కుట్ర చేశారు. తన కుట్రలు విఫలమై.. ఇప్పుడు అమరావతి నగరం అద్భుతంగా రూపుదిద్దుకోబోతున్న సందర్భాన్ని జగన్మోహన్ రెడ్డి చూసి తట్టుకోగలరా?
అందుకే మాజీ ముఖ్యమంత్రి అయినందుకు ఆయనకు ప్రభుత్వం ప్రధాని కార్యక్రమానికి సగౌరవంగా ఆహ్వానం పంపినప్పటికీ.. ఆయన వస్తారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. అమరావతిలో శుక్రవారం ప్రధాని చేతుల మీదుగా రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగబోతోంది. ఈ ఘట్టం కోసం రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అమరావతి రైతుల కుటుంబాలను సీఆర్డీయే సిబ్బంది ఇళ్లకు వెళ్లి కుటుంబసమేతంగా రావాలని బొట్టుపెట్టి మరీ ఆహ్వానిస్తున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కూటమి పార్టీల నాయకులు, ప్రజలు కూడా తరలిరావాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వానం అందింది. అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారి తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి ఆహ్వానపత్రిక అందించారు. జగన్ ఈ కార్యక్రమానికి వస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశం.
జగన్- అమరావతిని తనకు అనుకూలంగా వాడుకున్నారు. ఎన్నికలకు ముందు అక్కడ సొంత ఇల్లు నిర్మించుకున్న ఆయన తన నోటితే.. అమరావతి రాజధానికి తాను అనుకూలం అనే మాట చెప్పకుండా.. తన పార్టీ వారందరితోనూ ఆ మాటలు చెప్పించారు. చంద్రబాబుకు సొంత ఇల్లు లేదు.. మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాడంటే దాని అర్థం.. అమరావతికి అనుకూలంగా ఉన్నట్టే కదా అని మభ్యపెట్టారు. ప్రజలు నమ్మారు. తీరా గెలిచిన తర్వాత అమరావతి మీద విషం కక్కారు జగన్. రైతుల జీవితాలను రోడ్డుపాలు చేశారు. అరెస్టులుచేసి వేధించారు. మూడు రాజధానుల డ్రామా ఆడారను. అమరావతికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా తన డ్రామాలు ఆపలేదు. ఇన్ని కుట్రలు చేసినా కూడా.. ఇవాళ అమరావతి నగరం పునర్నిర్మాణానికి నోచుకుంటూ ఉండడం ఆయన తన కళ్లతో చూసి సహించగలరా? కార్యక్రమానికి రాగలరా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఏమో ఒక వేళ రాజకీయంగా తన నాటకాన్ని రక్తి కట్టించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి హాజరైనా కావొచ్చునని, ప్రధాని కనిపించిన వెంటనే ఆయన కాళ్ల మీద పడి తన భక్తిని చాటుకోవడానికి ఇది మరొక అవకాశంగా ఆయన భావించవచ్చునని కూడా ప్రజలు నవ్వుకుంటున్నారు.
అంతటి సహృదయం జగన్ కు ఉందా?
Thursday, December 18, 2025
