తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. తన హవా బాగా సాగిన రోజుల్లో, తన ప్రత్యర్థులను ఆటాడుకునే ఒక శైలిని అందరూ గమనించే ఉంటారు. తనను నిందించిన ఎవడైనా ఒక ప్రత్యర్థిని ఉద్దేశించి.. బహిరంగ సభలోనో, ప్రెస్ మీట్ లోనో మాట్లాడుతూ.. ‘ఎవడయ్యా వాడు.. వాడి పేరేంటి..’ అని అంటూ.. వెటకారంతో కూడిన ఒక నవ్వుతో, పక్కనే ఉన్న వాళ్లను అడుగుతారు. వాళ్లు సదరు నాయకుడి పేరును చిరునవ్వుతో అందిస్తారు. అప్పుడు కేసీఆర్.. ‘ఆ.. వాడే, వాడి పేరు పలకడం కూడా నాకు ఇష్టంలే’ అంటూ ఆ తర్వాత వాడిపై విమర్శలను కంటిన్యూ చేస్తారు. అంటే ఒకసారి ప్రత్యర్థిగా పరిగణించిన తర్వాత.. వారి పేరు ఉచ్ఛరించడానికి కూడా తాను ఇష్టపడను అని కేసీఆర్ సంకేతాలు ఇస్తుంటారు.
ఇప్పుడు ఆయన మేనల్లుడు హరీష్ రావు కూడా అచ్చంగా అదే సాంప్రదాయం పాటిస్తున్నారు. కాకపోతే.. కవిత ప్రస్తావన వచ్చినప్పుడు.. ‘‘ఎవరామె.. ఆమె పేరేంది..’’ అని పక్కన వాళ్లను అడిగితే చూస్తున్నవాళ్లు కూడా నవ్వుతారు గనుక.. ఆ హేళన టెక్నిక్ ను ప్రయోగించడం లేదు. మిగతాదంతా సేమ్ టు సేమ్! కేసీఆర్ పరువు తీసిన, ఆయన మీద సీబీఐ ఎంక్వయిరీ ఆదేశించడానికి కారణమైన అత్యంత అవినీతి పరుడిగా.. తన గురించి కల్వకుంట్ల కవిత తీవ్రమైన విమర్శలు చేసినప్పటికీ.. హరీష్ రావు కనీసం ఆమె పేరును కూడా ప్రస్తావించకుండా చాలా జాగ్రత్తగా విమర్శల్ని తిప్పికొట్టారు.
కాళేశ్వరం డ్యాం నిర్మాణంలో కేసీఆర్, హరీష్ రావు పాల్పడిన అవినీతి గురించి కేసును సీబీఐకు అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అర్ధరాత్రి అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్న తరువాత.. అదేరోజు ఉదయం తెల్లవారుజామున హరీష్ రావు బయల్దేరి బ్రిటన్ కు వెళ్లారు. లండన్ లో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మొత్తానికి శనివారం ఉదయం తిరిగి హైదరాబాదుకు వచ్చారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో తనను కలిసిన విలేకరులతో హరీష్ మాట్లాడారు.
భారాస నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి తన గురించి, కేసీఆర్ గురించి గత కొంత కాలంగా కొన్ని పార్టీలు ఎలాంటి విమర్శలనైతే చేస్తున్నాయో.. అవే విమర్శలను వారు కూడా ప్రస్తావించారు. నేను కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం పనిచేస్తున్న వ్యక్తిని . ఇలాగే పనిచేస్తుంటాం.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గారి నాయకత్వంలోనే పోరాడి.. తిరిగి అధికారంలోకి వస్తాం అని హరీష్ రావు అంటున్నారు. తన రాజకీయ జీవితం తెరచిన పుస్తకం అని ఆయన అంటున్నారు. నా మీద విమర్శలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నాని అని అంటున్నారు.
హరీష్ రావు, సంతోష్ కుమార్ ల మీద కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు సామాన్యమైనవి కాదు. కేసీఆర్ ను తప్పుదోవ పట్టిస్తూ.. భారాస పార్టీని నాశనం చేయడానికి వారు కుట్రలు చేస్తున్నారని ఆమె అన్నారు. అయినప్పటికీ.. హరీష్ మాత్రం.. చాలా జాగ్రత్తగా.. కవిత పేరు కూడా ప్రస్తావించకుండా, కాంగ్రెస్ పేరు కూడా ప్రస్తావించకుండా.. కాంగ్రెస్ నాయకులే ఆమె వెనుక ఉండి ఇలా తన మీద ఆరోపణలు చేయించారని అర్థం వచ్చేలా మాట్లాడడం విశేషం.
కవిత పేరు ఎత్తడానికి హరీష్ కు ఇష్టం లేదా?
Thursday, December 4, 2025
