రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు బోలెడు హామీలు కురిపిస్తారు. అది చేస్తాం ఇది చేస్తాం అంటూ వాగ్దానాల పర్వం నడిపిస్తారు. గెలిచిన తర్వాత పరిపాలన సాగే ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు తమ నుంచి పెద్దగా కొత్త ఆశలు పుట్టకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు ఐదు సంవత్సరాల పదవీకాలం గడువు కాలం లాగా పరిగణిస్తారు. హామీల ద్వారా ప్రభుత్వం మీద పడే ఆర్థిక భారాన్ని అనుసరించి ఒక్కటొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతారు. అయిదేళ్లలో అన్నీ పూర్తి చేస్తే చాలు.. వారిది అద్భుతమైన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం కింద లెక్క. కానీ గెలిచిన తర్వాత మొదటి ఆర్థిక సంవత్సరంలోనే ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పే దమ్ము ఎవరికైనా ఉంటుందా? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అలాంటి సాహసోపేతమైన మాట అంటున్నారు.
చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చింది. బీజేపీ జాతీయ స్థాయిలో ఇచ్చిన హామీలకే పరిమితం కాగా.. టీడీపీ, జనసేన కలిసి ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేశాయి. తెలుగుదేశం గత ఏడాది మహానాడు సందర్భంగా ప్రకటించిన సూపర్ సిక్స్ మాత్రమే కాకుండా.. అన్ని వర్గాల ప్రజలను ఉద్దేశించి అనేక హామీలు ఇచ్చారు.
ఆ హామీల వెల్లువ చూసి జడుసుకున్న జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబుకు మాట నిలబెట్టుకునే అలవాటు లేదు.. అని ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నించారు. అన్ని హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేదని, సాధ్యం కాదని అన్నారు. అయితే ప్రజలు జగన్ మాటలను విశ్వసించలేదు.
ప్రజలు తనమీద పెట్టుకున్న అపారమైన నమ్మకాన్ని మరింతగా నిలబెట్టుకునేలగా ఇప్పుడు చంద్రబాబు పనిచేస్తున్నారు. ఇప్పటికే చాలా హామీలు కార్యరూపం దాల్చాయి. ప్రకటించిన అన్నిటినీ మొదటి (ప్రస్తుత) ఆర్థిక సంవత్సరంలోనే నెరవేరుస్తామని అంటున్నారు. ప్రత్యర్థులకు నోట మాట రాకుండా చేస్తున్నారు. హామీలు నెరవేర్చడంలో బాబు చిత్తశుద్ధి పట్ల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.