ఒక వూరిలో ఒక ఎలుక, ఒక పిల్లి ఉన్నాయనుకోండి. ఆ పిల్లి తనను కొడుతోంది, కొరుకుతోంది.. తొందరలో చంపేసే చాన్స్ కూడా ఉంది.. అని ఎలుక పదే పదే అందరికీ తెలిసేలా అరచి గీ పెట్టినది అనుకోండి.. ఆ పిల్లి చాలా మంచిది అయినప్పటికీ, ఎలుకను ఏమీ చేయకపోయినప్పటికీ కొంచం భయపడుతుంది. ఎలుకకు ఏం ప్రమాదం జరిగినా నేరం తన మీదకు వస్తుంది కదా అని ఆందోళన చెందుతుంది. అందుకని ఎలుక ఉన్న వైపు కూడా వెళ్ళకుండా జాగ్రత్త పడుతుంది.
ఇదే కథను ఇప్పుడు రాజకీయాల్లో ఇంప్లిమెంట్ చేయాలని మద్యం కుంభకోణం నిందితులు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అతితెలివి తేటలు ప్రదర్శించడం ద్వారా కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా చూడడానికి.. పోలీసులు తమను విచారించేందుకు జంకేలా చేయడానికి వారు వ్యూహరచనతో ఉన్నట్టుగా అనిపిస్తోంది. మద్యం కుంభకోణంలో అందరికంటె లేటుగా అరెస్టు అయినది మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఆయన అనుంగు సహచరుడు వెంకటేశ్ నాయుడు. ఈ వెంకటేశ్ నాయుడు కోట్ల రూపాయల డబ్బు కట్టలతో వాటిని లెక్కిస్తూ గడిపిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అవన్నీ మద్యం ముడుపుల సొమ్ములను ఒకచోటకు చేర్చి, తరలించడానికి ముందు దిగిన వీడియోలే అని సిట్ పోలీసులు నిర్ధరించారు కూడా. అయితే.. చెవిరెడ్డి మాత్రం తన మీద ఆరోపణలు ఎడాపెడా ఖండిస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తుకాగా, వెంకటేశ్ నాయుడు భార్య వాసిరెడ్డి మహిత కోర్టులో వేసిన వ్యాజ్యం మరొక ఎత్తు. వెంకటేశ్ నాయుడు వీడియోలు బయటకు వచ్చిన వైనంపై ఆమే ఏకంగా పోలీసులమీదనే కోర్టులో కేసు వేశారు. తన భర్త ఫోను నుంచి సేకరించిన సమాచారాన్ని పోలీసులు మీడియాకు లీకే చేస్తున్నారని, ఇప్పటికే మీడియాలో వచ్చిన సమాచారాన్నంతా తొలగించాని, ప్రచురణ ప్రసారం జరగకండా చూడాలని ఆమె కోరారు. ఈ పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి.
వెంకటేశ్ నాయుడు సెల్ ఫోన్ డేటా లీక్ చేశాం అని చెప్పడం అర్థరహితమని సిట్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. యాపిల్ ఫోన్ లాక్ తీయాలంటే.. బయోమెట్రిక్, ఫేస్ లాక్ పాస్ వర్డ్ అవసరం అని.. లాక్ ను తెరిచేందుకు వెంకటేశ్ నాయుడు సహకరించడం లేదని చెప్పారు. ఫోన్ లో ఏముందో ఇప్పటికీ తమకు తెలియదని న్యాయమూర్తికి తెలియజేశారు. వెంకటేశ్ నాయుడు గురించి ఎలాంటి సమాచారమూ బయటకు రాకుండా కుట్రపూరితంగానే.. ఆయన భార్య గ్యాగ్ ఆర్డర్ కోసం ఇలాంటి పిటిషన్ వేసినట్టుగా పోలీసుల న్యాయవాది చెబుతున్నారు.
ఈ కేసులో వారి తెలివితేటలు చూస్తోంటే ఆశ్చర్యం కలుగుతోంది. జైలులోంచి బయటకు వచ్చిన ప్రతిసారీ చెవిరెడ్డి భాస్కర రెడ్డి పెద్దపెద్దగా కేకలు వేస్తూ మీడియా దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అదే మాదిరిగా ఆయన అనుచరుడు వెంకటేశ్ నాయుడు అండ్ కో కూడా.. తాము ఎంతగా రచ్చ చేస్తే అంత సేఫ్ గా ఉంటామని భ్రమపడుతున్నారో ఏమో తెలియడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
