ఒక కథ చెప్పుకుందాం.
అనగనగా ఒక దట్టమైన కారడవి ఉండేది. అదేమిటి అలా అంటున్నారు. అనగనగా అన్న తరువాత ఒక రాజ్యం లేదా ఊరు కదా ఉండాలి అని అడక్కండి. మన కథలో అనగనగా ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవికి రెండువైపులా రెండు గ్రామాలు ఉండేవి. ఆ ప్రజలు పొరుగు గ్రామానికి చేరుకోవాలంటే.. ఆ అడవిగుండా ఉన్న కాలిబాట తప్ప వేరే మార్గం లేదు పాపం. అలాంటి అడవిలో ఒక గజదొంగ ఉన్నాడు. ఆ దారమ్మట వెళ్లే గ్రామస్తులను వాడు కత్తి చూపి బెదిరించి.. వారివద్ద ఉన్న తృణమో పణమో దోచుకునేవాడు. అలాంటి గజదొంగకు అవసాన దశ వచ్చింది. చావుకు దగ్గరయ్యాడు. తన కొడుకును పిలిచి.. ‘ఓ కొడుకా.. నేను ఎటూ చచ్చిపోతున్నాను.. ఇన్నాళ్లూ దారమ్మట వచ్చిపోయే వాళ్లందరినీ దోచుకుతిన్నాను. కనీసం నేను చనిపోయిన తర్వాత నాకు మంచి పేరు వచ్చేలాగా, నలుగురూ నా గురించి మంచిగా చెప్పుకునేలాగా ఏదైనా పనిచేయి’ అని అడిగి కన్నుమూశాడు.
బతుకుతెరువు కోసం ఆ కొడుకు కూడా దోపిడీల బాట పట్టాడు. కానీ తండ్రి కోరిక తీర్చడానికి ఏం చేయాలో ఆ కొడుకుకు తోచలేదు. గజదొంగ అయిన తండ్రికి మంచి పేరు తీసుకురావడం ఎలాగ? అనేది అతడికి పెద్ద ప్రశ్న అయిపోయింది. చివరికి ఒక ఆలోచన స్ఫురించింది. ఆ అడవిలో దారమ్మట వచ్చే వారిని నిలువెల్లా దోచుకునేవాడు.. ఆ తర్వాత ఓ దుడ్డుకర్రతో వాళ్లను చితక్కొట్టి పంపేవాడు. ఉన్నసొమ్ము మొత్తం పోగా.. అదనంగా దెబ్బలు కూడా తినాల్సి వచ్చేసరికి.. ‘‘వీడికంటె వీడి తండ్రి చాలా బెటర్.. డబ్బు దోచుకుంటాడు గానీ.. కొట్టేవాడు కాదు.. వాడు చాలా మంచివాడు’’ అని అనుకోసాగారు జనం. ఆ రకంగా జనం తన తండ్రిని మంచివాడని అనుకునేలా ఆ దొంగ చేశాడన్నమాట.
==
పెద్దగీత చిన్నగీత లాంటి కథ ఇది. ఒక గీత పక్కన చిన్న గీత గీస్తే పాతది పెద్దగీత అయిపోతుంది. ఇప్పుడు ఈ కథ ఎందుకు గుర్తొస్తున్నదంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ఇప్పటి రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతూ ఇదివరలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పటి రోజులే చాలా బాగుండేవని వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండే రోజుల్లో అనేక అంశాలపై విమర్శలు, ప్రతి విమర్శలు వచ్చేవి కానీ, అవి హద్దు దాటకుండా, బాధ్యతాయుతంగా ఉండేవని చంద్రబాబు కితాబు ఇస్తున్నారు. ప్రస్తుతం వైకాపా నాయకుడు జగన్ విధ్వంసకర విధానాలు చూస్తోంటే.. ఇలాంటి వాళ్లతోనే మనం రాజకీయం చేయాల్సింది.. అనే బాధ కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆరకంగా చంద్రబాబు తనకు ప్రత్యర్థి అయినప్పటికీ.. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రోజులే మంచివని అంటున్నారన్నమాట.
సో, ఆ రకంగా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన తండ్రికి మంచి పేరుతెస్తున్న వాతావరణం ఇప్పుడు కనిపిస్తోందని జనం నవ్వుకుంటున్నారు.
తండ్రికి మంచి పేరు తెచ్చిన దొంగ కథ’ తెలుసా?
Friday, December 5, 2025
