ఒకవైపు- డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పోలీసులు పనితీరుపై నిప్పులు చెరగుతున్నారు. తాను గనుక హోంశాఖ తీసుకున్నానంటే.. పోలీసుల సంగతి చూస్తానన్నట్టుగా ఆయన హెచ్చరిస్తున్నారు. క్రిమినల్స్ కు కులం మతం ఉండవని తప్పు చేసిన వారు.. తన కుటుంబంలోని వ్యక్తి అయినా సరే కఠినంగా శిక్షించే తీరాలని పవన్ కల్యాణ్ ఆవేశంగా ఉపదేశిస్తున్నారు.
మరోవైపు- సోషల్ మీడియా నేరాలకు తాను కూడా బాధితురాలినే అంటూ సాక్షాత్తూ హోం మంత్రి వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, తన కుటుంబసభ్యుల పేర్లతో సోషల్ మీడియాలో అసభ్యమైన పోస్టులు పెడుతున్నారని కన్నీళ్లతో చెప్పుకున్నారు.
..ఇంత జరుగుతుండగా.. ఇలాంటి అసహ్యకరమైన అసభ్యమైన పోస్టులకు రూపకర్త అయిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు ‘వదిలేయడం’, మళ్లీ అరెస్టు పేరుతో దొరకడం లేదని డ్రామా నడిపిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అనేక కేసుల్లో నిందితుడైన వ్యక్తిని వదిలేయడంపై సీఎం చంద్రబాబునాయుడు, డీజీపీ ద్వారకా తిరుమల రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గానీ.. దానివల్ల ఉపయోగం ఏమిటి? చేతికి చిక్కిన వారిని వదిలేయడమే పెద్ద చేతగానితనం కదా అని.. ఎవరెంత మొత్తుకుంటున్నా ఈ పోలీసులు మారరా? అని ప్రజలు ఆగ్రహిస్తున్నారు.
కడప జిల్లా పులివెందులకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్ర రెడ్డిని పోలీసులు వదిలివేయడంపై సంచలనం రేగుతోంది. వర్రా రవీంద్రరెడ్డికి పోలీసులు 41ఏ నోటీసు ఇచ్చి వదిలేశారు. సీఎం, డీజీపీ ఆగ్రహించాక ఇప్పుడు మళ్లీ వెతుకుతున్నారు. అతను పరారీలో ఉన్నట్టుగా చెబుతున్నారు.
వర్రా రవీంద్రరెడ్డి గతంలో వైసీపీర జమానాలో మితిమీరి ప్రవర్తించిన వ్యక్తి. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, వంగలపూడి అనితలపై అసభ్యకరమైన పోస్టులతో అప్పట్లో చెలరేగారు. మంగళగిరి, హైదరాబాదుల్లో ఆయనపై పలు కేసులున్నాయి. పులివెందులలో అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్యంగా విచారించారు. 41ఏ నోటీసులు ఇచ్చి పంపేశారు. మళ్లీ ఆయనకోసం వెళ్లినప్పటికే అతను తప్పించుకున్నాడని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసు శాఖలోనే జగన్ కోవర్టులు ఉన్నారా అనే దిశగా ఆలోచించాల్సిన పరిస్థితి. పోలీసుల్లోనే ఉన్న జగన్ మనుషుల్ని ముందుగా ఏరితే తప్ప.. శాంతి భద్రతలు సెట్ కావని పలువురు అంటున్నారు.
ఎందరు ఎలా మొత్తుకుంటున్నా పోలీసులు మారరా?
Monday, January 27, 2025