ఎన్నికల వ్యూహకర్తలు అంటే.. ఎన్నికల్లో తాము పనిచేస్తున్న పార్టీ గెలవడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పాటుచేయడానికి పనిచేసేవారేమో అనే అభిప్రాయం మనకు ఉంటుంది. కానీ తాజాగా వెలుగులోకి వస్తున్న సంగతులను గమనిస్తే.. ప్రత్యర్థి పార్టీల వారిని ఎవరికీ అంతుబట్టని కోణాల్లోంచి అసభ్య, బూతు పోస్టులతో బద్నాం చేయడానికి కూడా వారి మేథస్సు పనిచేస్తుంటుందేమో అనిపిస్తోంది. ప్రత్యర్థులను బద్నాం చేసే రకరకాల దుర్మార్గమైన సోషల్ మీడియా పోస్టుల్లోని కంటెంట్ జన్మస్థానం ఐప్యాక్ అనే వాదన ఇప్పుడు వినిపిస్తోంది. వైఎస్ భారతి పీఏగా ప్రచారంలో ఉన్న వర్రా రవీందర్ రెడ్డి పోలీసు విచారణలో వెల్లడిస్తున్న విషయాలు దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నాయి.
చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, వంగలపూడి అనిత లు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యుల మీద కూడా మార్ఫింగ్ ఫోటోలతో కూడిన సోషల్ మీడియా పోస్టులు పెడుతూ వర్రా రవీందర్ రెడ్డి గత అయిదేళ్ల కాలంలో ఎంతగా రెచ్చిపోయారో ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా.. మరో కేసులో అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు చిక్కకుండా.. పండగకు వచ్చిన ఇంటి అల్లుడు లాగా పోలీసు స్టేషన్ నుంచి దర్జాగా పరారైపోయాడంటే వర్రా స్థాయి, దందా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. పరారీలో ఉన్న వర్రా మళ్లీ పోలీసులకు దొరికాడు. అందరూ విస్తుపోయే వివరాలను వెల్లడించాడు.
వైసీపీ ప్రత్యర్థి పార్టీల నాయకులు, వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టేవాళ్లం అని.. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి సూచనలతోనే పోస్టులు పెట్టామని, సజ్జల భార్గవ రెడ్డి బాధ్యత తీసుకున్నాక మరింతగా రెచ్చిపోయాం అని వర్రా చెబుతున్నారు. భార్గవ బెదిరించి మరీ జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టించినట్టు చెబుతున్నాడు. 023 నుంచి తన ఫేస్ బుక్ ఐడీతో భార్గవ రెడ్డే పోస్టులు పెట్టేవాడని కూడా అంటున్నారు. అవినాష్ పీఏ రాఘవరెడ్డి కూడా వీరికి కంటెంట్ ఇచ్చేవాడట. ఐప్యాక్ టీమ్ ఇచ్చిన కంటెంట్ ను ఫేస్ బుక్ లో పోస్టు చేసేవాళ్లం అంటూ వర్రా మొత్తం వ్యవహారం వివరించినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే అవినాష్ పీఏ కోసం పోలీసులు వెతుకుతున్నారు. సజ్జల భార్గవ రెడ్డి కోసం లుకౌట్ నోటీసులు జారీ అయి ఉన్నాయి. చూడబోతే రేపూ మాపో ఐప్యాక్ టీం సారథుల మీద కూడా కేసు నమోదు అవుతుందని.. వారికి కూడా కటకటాలు తప్పవని పలువురు అంచనా వేస్తున్నారు.
ఐప్యాక్ సారథులకు కూడా బేడీలు పడతాయా?
Tuesday, January 21, 2025