వారందరూ జగన్ మీద తిరుగుబాటు చేస్తారని చెప్పలేం. కానీ ఒక తిరుగుబాటుకు తగినంత అసంతృప్తితో మాత్రం రగిలిపోతున్నారు. జగన్ మీద గుస్సా అవుతున్నారు. తన స్వార్థం, తన పంతం మాత్రం చూసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి తామందరి రాజకీయ భవిష్యత్తుకు సమాధి కడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు బాధపడుతున్నారు. జగన్ పార్టీ తరఫున ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉండవచ్చు గానీ.. జగన్ పెట్టిన రాజకీయ భిక్షతో తాము బతుకుతున్నాం అనుకోరాదని, జగన్ కంటె ముందునుంచే రాజకీయాల్లో ఉన్నాం అని.. ఇప్పుడు జగన్ కారణంగా తమ రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని చెడ్డపేరు వచ్చేలా ఉన్నదని కూడా కొందరు సీనియర్లు వాపోతుండడం విశేషం.
జగన్మోహన్ రెడ్డి తను ప్రతిపక్ష హోదా ఇచ్చేవరకు శాసనసభకు వెళ్లాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యేలు అందరినీ శాసించారు. అదే సమయంలో సభలో మెజారిటీ ఉన్న మండలిలో మాత్రం ఎమ్మెల్సీలను వెళ్లి అక్కడ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పారు. ఎమ్మెల్యేలు మాత్రం మీడియా వద్ద మాత్రమే మాట్లాడాలట.
‘అసెంబ్లీకి వెళ్ళకూడదు’ అనే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఆత్మహత్యాసదృశం- అనే భావన పార్టీ ఎమ్మెల్యేలలో వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జగన్మోహన్ రెడ్డి శాసనసభ సమావేశాలకు ముందుగా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ రెండు వర్గాలతో ఆయన విడివిడిగా భేటీ కావడం గమనించాల్సిన సంగతి! ఎమ్మెల్సీలను మాత్రం సభలో గట్టిగా వ్యవహరించాలని, ప్రభుత్వ విధానాలను నిలదీయాలని పురమాయించిన జగన్మోహన్ రెడ్డి.. ఎమ్మెల్యేలతో మాత్రం అసలు సభకు వెళ్లడమే వద్దని, ఏమైనా ఉంటే మీడియా ముందు మాత్రమే మాట్లాడాలని చెప్పడం వారికి అసంతృప్తిని కలిగిస్తోంది.
నిజానికి, ప్రతిపక్షనేత హోదా ఇవ్వలేదు కనుక జగన్మోహన్ రెడ్డి మాత్రం శాసనసభకు రారని మిగిలిన ఎమ్మెల్యేలు తమకు సంబంధించిన ప్రశ్నలుంటే అసెంబ్లీకి వెళ్లవచ్చునని పార్టీ పెద్దల ద్వారా ఆదివారం అందరికీ సమాచారం సర్కులేట్ అయింది. అయితే సోమవారం జగన్ ఎమ్మెల్యే లతో నిర్వహించిన సమావేశంలో ‘ఎవ్వరూ సభకు వెళ్లవద్దు’ అని తేల్చి చెప్పారు. తన హోదా సంగతి హైకోర్టులో ఉన్నదని ఆ సంగతి తేలాలని ఆయన అన్నారు. 40శాతం ఓట్లు లభించినందుకు గాను ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం అనేది దేశంలో ఎక్కడా లేని విషయం. జగన్ ఒక అసంబద్ధమైన పాయింట్ పట్టుకొని కోర్టులో కేసు వేసి, నెగ్గే అవకాశం లేని కేసు కోసం తామందరినీ అసెంబ్లీకి వెళ్ళనివ్వకుండా చేస్తున్నారని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. అప్పటికీ ఇలాంటి నిర్ణయం వలన ప్రజలలో చెడ్డపేరు వస్తుందని కొందరు జగన్ కు నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. ఆయన మాత్రం చాలా అసహనంతో స్పందించినట్లు చెబుతున్నారు. జగన్ పోకడల పట్ల ఎమ్మెల్యేలలో భిన్నాభిప్రాయాలు, అసంతృప్తులు పెరుగుతున్నాయి.