వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైయస్ షర్మిలను అడ్డగోలుగా తిట్టిపోయడం ఒక్కటే వారి పరమ లక్ష్యం. ఆమె క్రెడిబిలిటీని దెబ్బతీయటమే ఆశయం. ఆమె మాటలను ప్రజలు నమ్మకూడదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఉండే ప్రజాదరణ ఆమె వైపు కించిత్తు కూడా మళ్లకూడదు. క్యారెక్టర్ అసాసినేషన్ చేసి అయినా సరే ఆమెను దెబ్బ కొట్టాలి… ఇదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న దుర్నీతి. కడప ఎంపీ నియోజకవర్గం పరిధిలో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తూ జగన్మోహన్ రెడ్డికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న వైఎస్ షర్మిల మీదకు ప్రయోగించడానికి తెలంగాణ నుంచి ఆమె మాజీ అనుచరుడిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా తీసుకువచ్చింది.
షర్మిల తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన రోజులలో ఆమె తరఫున కీలక అనుచరుడిగా కొండా రాఘవరెడ్డి పని చేశారు. షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన సందర్భంలో ఆయన బయటకు వెళ్లారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి నమ్మకస్తులైన నాయకుల్లో కొండా రాఘవరెడ్డి కూడా ఒకరు. అలాంటి వ్యక్తిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా కడపకు పిలిపించుకుని షర్మిలను తిట్టిపోయడం, ఆమె క్రెడిబిలిటీని దెబ్బతీయడం, ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనే త్రిముఖ బాధ్యతలను ఆయన చేతిలో పెట్టింది. జగన్ పార్టీ పురమాయింపు మేరకు రాఘవరెడ్డి తనకు ఇష్టం వచ్చిన రీతిలో రెచ్చిపోతున్నారు.
కీలకంగా గమనిస్తే… ‘‘నువ్వు మురుసుపల్లి షర్మిలవు! మురుసుపల్లి షర్మిలగా నువ్వు ఏ ఫుట్పాత్ మీద తిరిగినా మాకు అభ్యంతరం లేదు. నువ్వు వైఎస్ షర్మిలవు కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నిన్ను గుర్తించడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా సిద్ధంగా లేరు’’ అంటూ ఈ కొండా రాఘవరెడ్డి ఐదు కోట్ల మంది ప్రజల తరఫున వారి అభిప్రాయాలు మొత్తం తనకే తెలుసు అన్నట్టుగా మాట్లాడుతున్నారు.
‘‘నిన్నటిదాకా తెలంగాణ బిడ్డను అన్నావు, ఇవాళ కడప ఎంపీగా పోటీ చేస్తున్నావు’’ అని షర్మిలను నిందించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ సాధారణ ప్రజలకు కలుగుతున్న సందేహం ఒకటి ఉంది. షర్మిల తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించినప్పుడు కూడా తనను తాను వైయస్ షర్మిల గానే చలామణి చేసుకున్నారు. అప్పట్లో కొండా రాఘవరెడ్డి నిత్యం షర్మిల వెన్నంటి ఉంటూ ఆమె భజన చేస్తూ ఆమె కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ కాలం గడిపారు. ఆమె తెలంగాణ రాజకీయాలలో తిరిగినంత కాలం ఆమె పేరు వైయస్ షర్మిల కాదని, మురుసుపల్లి షర్మిల మాత్రమే అని ఆయనకు తెలియదా అనేది ప్రజల సందేహం.
షర్మిల ని ఎదుర్కోవడం తనకు తన పార్టీలోని నాయకులకు చేతకాక జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కిరాయి వ్యక్తుల మీద ఆధారపడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.
ఆమె ‘మురుసుపల్లి’ అని అప్పుడు తెలీదా కొండా?
Wednesday, January 22, 2025