ఇప్పుడంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత హోదాలో ఆయన బస్సెక్కి ఊరూరా తిరుగుతున్నారు గానీ.. ఇదివరలో పరిస్థితి అది కాదు కదా! ముఖ్యమంత్రి హోదాలో తాడేపల్లి నుంచి తెనాలి వెళ్లడానికి కూడా హెలికాప్టర్ ఉపయోగించిన చరిత్ర ఆయనది కదా! మరి అలాంటి ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏదైనా ఊరిలో అడుగుపెడుతున్నారంటే.. ఆర్భాటం ఎలా ఉండేది? హెలిపాడ్ నుంచి సభావేదిక వరకు జగన్ ప్రయాణించే దారిపొడవునా చెట్లు నరికేసేవాళ్లు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను మూయించేసేవాళ్లు, రోడ్ల పక్కన బారికేడ్లు కట్టి వాటికి పరదాలు కట్టేసేవాళ్లు! భద్రతా ఏర్పాట్ల పేరుతో ఇలాంటి అతి చాలా చేసేవాళ్లు. ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారా? అని ప్రజలు ప్రతిసారీ విస్తుపోతూ ఉండేవాళ్లు. కానీ అలాంటి ఏర్పాట్ల వెనుక మర్మం ఇప్పుడు బోధపడుతోంది.
ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద ఆకతాయి ఎవరో రాయి విసిరి ఆయన తలమీద గాయం చేసిన తీరును గమనిస్తే.. కొన్ని రోజుల కిందట ఇదే బస్సుయాత్రలో అనంతపురంలో గుర్తు తెలియని వ్యక్తి జగన్ మీద చెప్పు విసిరిన వైనంతో దీనిని పోల్చుకుని పరిశీలిస్తే.. జగన్ మీద ప్రజల్లో వ్యతిరేకత, ద్వేషభావం చాలా పెద్దస్థాయిలోనే.. చాలా ఎక్కువమందిలోనే ఉన్నదని అనిపిస్తోంది.
ఇంకాస్త లోతుగా ఈ పరిణామాలను గమనిస్తే.. ఇంకో సంగతి కూడా అర్థమవుతుంది. తన మీద, తన ప్రభుత్వం- పాలన మీద ప్రజల్లో అసంతృప్తి ఉన్నదని.. వారు ఆ అసంతృప్తిని ఇలాంటి చర్యల ద్వారా వెళ్లగక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నారని.. జగన్మోహన్ రెడ్డికి ఎప్పటినుంచో తెలిసే ఉండాలి. బహుశా ఇంటెలిజెన్స్ నిఘా నివేదికలు ఆయనకు ఇలాంటి సమాచారాన్ని అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచి కూడా చేరవేస్తూనే ఉండిఉండాలి. అలాంటి ఘటన జరిగితే.. తన పరువు పోతుంది గనుక.. ఆయన ఇన్నాళ్లూ పరదాలు కట్టుకుని తిరిగారు. తను ప్రయాణించే రోడ్డు పొడవునా చెట్లను నరికివేయిస్తూ వచ్చారు.
కానీ ఇప్పుడు తప్పలేదు. ఎన్నికలు గనుక.. ఈ సమయంలో కూడా ప్రజలకు దూరంగా ఉంటే, పరదాలు కట్టుకుని తిరిగితే నష్టం తనకే గనుక.. ఆయన అయిదేళ్లలో తొలిసారిగా రోడ్డుమార్గంలో కాస్త ఎక్కువ దూరం ప్రయాణిస్తున్నారు. ప్రజలు కూడా ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాం అనిపించేలా ఒక ఊరిలో చెప్పు విసిరితే, మరో ఊరిలో రాయి విసిరారు. ఇవాళ్టి నుదిటి గాయాన్ని ఆయన సానుభూతి పుట్టించేలా ఎంత మేర మలచుకోగలరో తెలియదు గానీ.. ప్రజల్లో జగన్ పట్ల కనిపిస్తే కొట్టాలనిపించేంత కోపం ఉన్నదని మాత్రం ఈ ఘటనల వల్ల అనిపిస్తోందని ప్రజలు భావిస్తున్నారు.