జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్న రోజుల్లో.. ఒక సంఘటనను ఇప్పుడు గుర్తు చేసుకోండి. జనవాణి పేరుతో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, వారి నుంచి వినతులు స్వీకరించడానికి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వెళ్లారు. జగన్ భక్త పోలీసులు ఆయనను కనీసం విమానాశ్రయం నుంచి తమ కార్యక్రమం జరిగే స్థలం వరకు కూడా వెళ్ళనివ్వలేదు. మధ్యలో ఆయన బస చేసిన హోటల్ లోనే నిర్బంధించారు.
కార్యక్రమం చేయడానికి వీలు లేదని ఆంక్షలు పెట్టారు. ఆయన వెళ్లడం వలన శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని పసలేని కబుర్లు చెప్పారు. రెండు రోజులు కేవలం హోటల్ గదిలోనే అప్రకటిత బందీ లాగా ఉండిపోయిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని తిరిగి వెళ్లిపోయారు.
కేవలం ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించడం వల్లనే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పవన్ ను బందీ చేసిన పోలీసులు ఇవాళ ఏమైపోయారు? తన వలన శాంతి భద్రతలు విషమించి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని అందరికీ తెలిసినప్పటికీ కూడా.. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుంగనూరు నియోజకవర్గానికి ఎలా వెళ్లగలిగారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది.
పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి బుధవారం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వెళ్ళినప్పుడు అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలా జరుగుతుందని ఆయనకు ముందే తెలుసు. ఎందుకంటే కొన్ని రోజులు ముందర ఇదే పుంగనూరు యాత్ర పెట్టుకున్నప్పుడు.. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే సంగతిని ఆయనకు తెలియజెప్పి.. పోలీస్‌లు తిరుపతిలోని నివాసం నుంచి ఆయనను కదలనివ్వలేదు. ఆరోజు చాలా గోల చేసిన మిథున్ రెడ్డి మొత్తానికి ఇవాళ పోలీసుల కళ్ళు కప్పారో ఏమో పుంగనూరు వెళ్ళగలిగారు.
ఆయన రెడ్డెప్ప ఇంటికి వెళ్లడమే తడవుగా వైసిపి శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి. ‘మిథున్ రెడ్డి గో బ్యాక్’ అంటూ టిడిపి వారు కూడా అక్కడకు వచ్చారు. ఇరువర్గాల మధ్య రాళ్లు విసురుకోవడం జరిగింది. ఉద్రిక్తత నెలకొంది. ఇలాంటి ఉద్రిక్తతలు నెలకొనాలి అనే కోరికతోనే మిథున్ రెడ్డి పుంగనూరు వెళ్ళారనే విమర్శలు వస్తున్నాయి. అలా జరిగితే టిడిపి సర్కారు మీద బురద చల్లవచ్చునని ఆయన ప్లాన్ తో ఉన్నట్టుగా తెలుస్తోంది.
రెండురోజుల కిందట మిథున్ పెదనాన్న పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డికి తంబళ్లపల్లెలో ఇలాంటి అనుభవమే ఎదురైంది. దొంగవోట్లతో గెలిచారంటూ ప్రజలు ప్రతిఘటించారు. ఇప్పుడు అలా ప్రజల్ని రెచ్చగొట్టడానికే మిథున్ పుంగనూరు వెళ్లారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.