ఆంధ్రప్రదేశ్ అనే సామ్రాజ్యానికి జగన్ మోహన్ రెడ్డి తనను తాను కిరీటం లేని చక్రవర్తిగా భావించుకున్న ఐదేళ్ల కాలంలో.. చిలకలూరిపేట అనే సామంతరాజ్యానికి తాను రాణినని విడదల రజని.. ఊహించుకున్నట్లుగా అక్కడి వ్యవహారాలు నడిచాయి. తన రాజ్యంలో ఉండేవారు, వ్యాపారాలు చేసుకునేవారు, సంస్థలను నడుపుతున్న వారు అందరూ తనకు కప్పం కడితే గాని ఊరుకునేది లేదని విడదల రజిని ఒక సంపాదన మార్గాన్ని ఎంచుకున్నట్లుగా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నది. లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానుల నుంచి ఏకంగా ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం అనేది– ఆమె దందాలు ఏ స్థాయిలో సాగాయో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. తాను చెప్పినట్లుగా సొమ్ము చెల్లిస్తే వ్యాపారాలు చేసుకోగలరని, లేదా నిబంధనల పేరిట వ్యాపారాలను పూర్తిగా మూసివేయిస్తానని బెదిరించడం.. తదనగుణంగా అధికారులను దాడులకు పంపి ఆ వ్యాపారాల యజమానులపై జరిమానాల రూపంలో ఒత్తిడులు పెంచడం.. ఇవన్నీ విడదల రజిని సాగించిన దందా తీరుతెన్నులు. సదరు బాగోతం మొత్తం బట్టబయలు అయిన తర్వాత రజిని, ఆమెకు సహకరించిన ఐపీఎస్ అధికారి జాషువా, ముడుపులను పుచ్చుకోవడానికి కేంద్ర బిందువుగా వ్యవహరించిన ఆమె మరిది గోపి అందరి మీద ఏసీబీ కేసులు నమోదు అయ్యాయి. విజిలెన్స్ మరియు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ప్రాథమిక దర్యాప్తు జరిపి, ఆధారాలు దొరికిన తర్వాత మాత్రమే ఈ కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. అయితే కాస్త లోతుగా గమనించినప్పుడు విడదల రజిని బెదిరింపులు సాగించిన రోజుల్లో స్టోన్ క్రషర్ యజమానులను లొంగదీసుకోవడానికి రేంజ్ అధికారిగా ఉన్నటువంటి పల్లె జాషువా చేసిన ఓవరాక్షన్ కారణంగానే వీరందరూ పూర్తిగా కేసులో ఇరుక్కున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ దందా జరిగిన క్రమం తెలుసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. తొలుత లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానుల వద్దకు విడదల రజని పీఏ రామకృష్ణ వెళ్లారు. ‘మేడమ్ ను కలవాలని’ ఆమె హుకుం వారికి అందజేశారు. క్రషర్ యజమానులు వచ్చి ఆమెను కలిసినప్పుడు తన నియోజకవర్గంలో వ్యాపారం చేసుకోవాలంటే తనకు ఐదు కోట్ల రూపాయలు ముట్ట చెప్పాలని, లేకపోతే వ్యాపారం చేయలేరని రజని హెచ్చరించారు. ఇది జరిగిన వారం రోజులు కూడా గడవకమునుపే పల్లె జాషువా భారీ సంఖ్యలో అధికారులను సిబ్బందిని స్టోన్ క్రషర్ వద్దకు తీసుకెళ్లి తనిఖీలు నిర్వహించారు. మేడం చెప్పినట్లుగా చేయాలని హెచ్చరించారు. తనిఖీలు చేసి వెళ్లిపోయిన పెమట ఓ నెల రోజులకు పల్లె జాషువా స్టోన్ క్రషర్ యజమానులతో 50 కోట్ల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉందని.. అలా జరగకుండా ఉండాలంటే ముందు రజని మేడంను కలిసి వ్యవహారం తొందరగా సెటిల్ చేసుకోవాలని బెదిరించారు. దీంతో భయపడిన స్టోన్ క్రష్ యజమానులు ఆమె దగ్గరికి వెళ్లి 5 కోట్ల డిమాండ్ ను కాస్త రెండు కోట్ల వరకు బేరమాడి తగ్గించుకున్నారు. ఆమె సూచన మేరకు పురుషోత్తమపట్నంలో ఉండే ఆమె మరిది గోపి వద్దకు వెళ్లి రెండు కోట్ల రూపాయలు ఆమె కోసం ఇచ్చారు. అదనంగా అతనికి 10 లక్షల రూపాయలు, పల్లె జాషువాకు 10 లక్షల రూపాయలు సమర్పించుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రాథమిక విచారణలో ఈ ఆరోపణలు వాస్తవమే అని కూడా తేలింది.
పల్లె జాషువా భారీ సంఖ్యలో సిబ్బందిని క్రషర్ వద్దకు తనిఖీలకు తీసుకువెళ్లారు గాని అధికారికంగా అక్కడకు వెళుతున్నట్లుగా తన పై అధికారులకు సమాచారం కూడా ఇవ్వలేదు. అలాగని తనిఖీలకు వెళ్లి వచ్చిన తర్వాత నివేదికలు కూడా తయారు చేయలేదు. కేవలం ఆ వ్యాపారులను బెదిరించి దందా చేయడానికి మాత్రమే భారీ సంఖ్యలో సిబ్బందితో తనిఖీలకు వెళ్లారని తేటతెల్లం అవుతోంది. తమకు ఏ సంగతీ తెలియదని, జాషువా ఆదేశాలమేరకు మాత్రమే తనిఖీలకు వెళ్ళామని అందులో పాల్గొన్న అధికారులందరూ విచారణలో చెప్పుకొచ్చారు. దీంతో బెదిరింపులు కోసం తనిఖీల నాటకమాడినట్టుగా స్పష్టమైపోయింది. ఆ రకంగా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా చేసిన ఓవరాక్షన్ కారణంగా ఇప్పుడు విడుదల రజని తప్పించుకోవడానికి అవకాశం లేకుండా కేసులో చిక్కుకుపోయినట్టుగా అర్థమవుతుంది.
ఆమె మాత్రం తనకసలు ఆ క్రషర్ యజమానులు తెలియనే తెలియదని.. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని చెప్పుకుంటున్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కుట్రపూరితంగా తనని కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే విడుదల రజని మాటలకు విలువ దక్కే అవకాశం కనిపించడం లేదు. కేసు నమోదయింది గనుక ఈ ముగ్గురు నిందితులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే చాలా త్వరగానే కేసు ఒక కొలిక్కి వస్తుందని, ఆమేరకు పోలీసుల వద్ద ఇప్పటికే పక్కా ఆధారాలు ఉన్నాయని అనుకుంటున్నారు.