ఇవాళ్టి రోజుల్లో రాజకీయాలు మొత్తం డబ్బుతో ముడిపడిపోయి ఉన్న సంగతిని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. నాయకులు ఎన్ని హామీలైనా ఇవ్వచ్చు గాక.. ఎన్ని రకాల ప్రచారాలు అయినా చేయవచ్చు గాక.. అంతిమంగా పోలింగ్ కు ముందురోజు ఒక్కో ఓటుకు ఎంత రేటు పెట్టి కొనుక్కుంటారు? ఎవరు ఎక్కువ ఓట్లను కొనుక్కోగలిగారు..? అనేదానిమీదనే ఫలితాలు ఆధారపడి ఉంటున్నాయి. ఆ విషయాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఓట్లకొనుగోలు అనేది చాలా కామన్ వ్యవహారం అయిపోయింది. అసెంబ్లీ సెగ్మెంటులో ఎన్నికకు కనీసం యాభైకోట్ల రూపాయల బడ్జెట్ వేసుకుంటున్నారంటే.. వాతావరణం ఎంత ధనమయంగా మారిపోయిందో మనకు తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఒక్కో ఓటుకు ఎంత సొమ్ము ఇవ్వబోతోంది? ఈ ఆసక్తి ఎవ్వరికైనా ఉంటుంది? అయితే జగనన్న ఓటుకు ఎన్ని వేలు ఇవ్వబోతున్నారో ఆయన చెల్లెలు షర్మిల చిన్న లీకు ఇచ్చారు.
చిత్తూరుజిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్ షర్మిల.. ఓట్లు కొనుగోలు చేసి ఎన్నికల్లో నెగ్గడానికి జగన్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఒక్కోఓటుకు అయిదువేల రూపాయలు ఇవ్వడానికి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు నిధులు సమకూర్చుకుని ఉన్నారని షర్మిల చెప్పుకొచ్చారు. ‘వాళ్లు ఇచ్చే డబ్బులన్నీ తీసుకోండి. అదంతా మీనుంచి లాక్కున్నదే. డబ్బు తీసుకోండి కానీ ఓటు మాత్రం జగన్ కు వేయొద్దు’ అని షర్మిల పిలుపు ఇస్తున్నారు.
ఒక్కో ఓటుకు అయిదువేల రూపాయలు అనేది చాలా అతిశయంగా కనిపిస్తున్న మొత్తం. ఆ లెక్కన ఒక్కో నియోజకవర్గంలో వందకోట్లకు పైనే పెట్టాల్సి వస్తుంది. షర్మిల కూడా జగన్ పార్టీనుంచి ప్రజలు ఎక్కువ డిమాండ్ చేసినా పర్లేదులెమ్మనే ఉద్దేశంతో అలా అన్నారో ఏమో తెలియదు గానీ.. ఓటుకు రెండువేల రూపాయలు ఇవ్వడం మాత్రం చాలా సాధారణ ఓటు ధరగా మారిపోయినట్టు పలువురు పేర్కొంటున్నారు.
ఇదివరకటి ఓట్ల కొనుగోలు వ్యవహారాలతో పోలిస్తే ప్రధానంగా వచ్చిన తేడా ఏంటంటే.. ఇదివరకు వేలం పాటలాగా ప్రత్యర్థి ఎంత డబ్బుఇస్తున్నాడనేదాన్ని బట్టి.. రెండో పార్టీ అభ్యర్థి కాస్త మొత్తం పెంచి ఇస్తూపోయేవారని.. ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రారంభ ధరే రెండువేలుగా నిర్ణయించి ఓట్లు కొనడానికి సిద్ధపడుతున్నారని తెలుస్తోంది.
పేదల ఓటుకు జగన్ రేటెంతో లీక్ వచ్చిందిలా?
Wednesday, December 18, 2024