ఆయన పాపం అమాయకుడైన యువ నాయకుడు! చంద్రబాబునాయుడు మీద పోటీచేయడానికి నిన్ను మించిన మొనగాడు లేడని జగన్ మోహన్ రెడ్డి మాయమాటలు చెబితే నిజమే కాబోలుననుకుని మురిసిపోయాడు! చంద్రబాబు మీద నిత్యం వ్యతిరేక గళం వినిపిస్తూ ఆయన సొంత నియోజకవర్గంలో అయిదేళ్లు పాటూ రెచ్చిపోయాడు. ఆయన రెచ్చిపోవడానికి కాస్త ఉపయోగంగా ఉంటుందని.. జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కూడా కట్టబెట్టారు. తీరా ఎన్నికల్లో చంద్రబాబు మీద తొడగొట్టి దారుణంగా భంగపడ్డారు. అప్పటిదాకా కనులముందు కమ్ముకున్న పొరలు తొలగిపోయాయి. భ్రమలు వీడాయి. తట్టాబుట్టా సర్దుకుని కుప్పం నియోజకవర్గం నుంచి పలాయనం చిత్తగించి.. సొంత ఊర్లో, సొంత వ్యాపారాలు, వ్యవహారాలు చూసుకునే పనిలో పడ్డారు. ఆయన దూకుడైన నాయకత్వాన్ని నమ్ముకుని కుప్పంలో రెచ్చిపోతూ వచ్చిన జగన్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు.. తమ ఎమ్మెల్సీ కనిపించడం లేదంటూ పోస్టర్లు డిజైన్ చేసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తుండడం జరుగుతోంది. ఆయన మరెవ్వరో కాదు.. వైసీపీ ఎమ్మెల్సీ, కుప్పం నాయకుడిగా కొన్నాళ్లు హడావుడి చేసిన భరత్.
35 ఏళ్ల యువ నాయకుడు భరత్ ను వైఎస్సార్ కాంగ్రెస్ గతంలో జిల్లా పార్టీ అధ్యక్షుడుగా కూడా నియమించింది. తనకు వచ్చిన ఈ అవకాశం కేవలం తన బలమే అనుకుని భరత్ రెచ్చిపోతూ వచ్చారు. జగన్ రెడ్డి అరాచక పరిపాలన సాగుతూ వచ్చిన రోజుల్లో కుప్పంలో వారి పార్టీ సాగించిన అరాచకత్వానికి భరత్ కేంద్ర బిందువుగా వ్యవహరించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం మునిసిపాలిటీని వైఎస్సార్ కాంగ్రెస్ చేజిక్కించుకోవడంలో భరత్ కీలక పాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వారిని బెదిరించడంలోనూ, వారిని బలవంతంగా వైసీపీలోకి మళ్లించడంలోనూ ఆయన దూకుడు అప్పట్లో బాగా వివాదాస్పదం అయింది. కుప్పంలో తెలుగుదేశం కార్యకర్తలు ఉచితంగా ప్రజలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ లను నిర్వహించడం ప్రారంభించగా.. ఆ అన్న క్యాంటీన్ లను పూర్తిగా ధ్వంసం చేయించిన ఘనత కూడా భరత్ దే. చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా కుప్పంలో చెలరేగుతూ.. దూకుడుగా పనిచేయడానికి వీలుగా.. ఆయనకు ప్రోటోకాల్ రక్షణ ఉండాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవిని కూడా కట్టబెట్టారు. ఆ తర్వాత ఆయన భరత్ రెచ్చిపోవడం ఇంకా పెరిగింది. 2024 ఎన్నికల్లో బాబు మీద పోటీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా రంగంలోకి దిగారు. జగన్మోహన్ రెడ్డి లాగానే.. తమ పార్టీ గెలుస్తుందనే భ్రమల్లో మునిగి ఉన్నారు. భారీగా ఖర్చు పెట్టారు. అయినా చంద్రబాబు దెబ్బకు ఆయనకు తలకిందులయ్యారు. అప్పటినుంచి అసలు నియోజకవర్గంలో కనిపించడమే లేదు. తన సొంతూరు హైదరాబాదుకు తరలిపోయారనే వార్తలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆయన అండ చూసుకుని రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలకు ఇప్పుడు అగమ్యగోచరంగా ఉంది. దీంతో విసిగిపోయిన కార్యకర్తలు తమ ఎమ్మెల్సీ కనిపించడం లేదంటూ.. పోస్టర్లు డిజైన్ చేసి సోషల్ మీడియాలో పెట్టగా, అవి వైరల్ అవుతున్నాయి.
చంద్రబాబు దెబ్బకు రాజకీయం మానుకున్నారేమో!
Saturday, December 21, 2024