ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒక సరికొత్త భేషైన ప్రయోగం చేయబోతున్నారు. నిజానికి ఇది నాయకులు అనుసరించే సాంప్రదాయ కార్యక్రమానికి సరికొత్త ఆధునిక సాంకేతికతల మేళవింపు. ఇదే కార్యక్రమాన్ని ఆయన రాష్ట్రమంతా విస్తృతంగా నిర్వహించడానికి పూనుకుంటున్నారు. తద్వారా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల ప్రజల కష్టాలను కూడా పరిష్కరించడం, వారితో టచ్ లో ఉండడం, ఆదరణ చూరగొనడం సాధ్యమవుతుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ ‘మన ఊరు- మాటామంతీ’ పేరుతో.. ఒక్కో గ్రామానికి చెందిన ప్రజలతో ముఖాముఖీలను నిర్వహించబోతున్నారు.
నాయకులు ప్రజలతో ముఖాముఖి నిర్వహించడం అనేది సరికొత్త ప్రయోగం ఎంతమాత్రమూ కాదు. ప్రజాప్రతినిధులు ఎన్నికవుతున్న తొలినాళ్లనుంచి ఏదో ఒకరూపంలో అమలవుతూ ఉన్నదే. గతంలో ప్రజల వద్దకు పాలన వంటి పథకాలు కూడా ఇలాంటివే. చంద్రబాబునాయుడు కూడా గతంలో ఇలాంటివి నిర్వహించారు. ఇప్పటికీ.. గ్రామాల్లో పర్యటించిన ప్రతిసారీ.. ప్రజలతో ముఖాముఖీ మాట్లాడుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. చాలావరకు అక్కడికక్కడే పరిష్కరించేస్తున్నారు.
కానీ పవన్ కల్యాణ్ ప్లాన్ చేసిన మాటామంతీ కొంత భిన్నమైనది. ఇది లైవ్ ప్రసారం ద్వారా ఆన్ లైన్ లో ప్రత్యక్ష ప్రసారం రూపంలో జరుగుతుంది. నిజానికి ప్రత్యక్ష ప్రసారంలో ముఖాముఖీ కూడా కొత్త సంగతి కాదు గానీ.. ఆయన ఈ కార్యక్రమాన్ని సినిమా థియేటర్లలో నిర్వహిస్తున్నారు. టెక్కలి నియోజకవర్గంలో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని 22న నిర్వహించడానికి ప్లాన్ చేశారు. పవన్ కల్యాణ్ ప్రణాళిక ప్రకారం.. రావివలస గ్రామం నుంచి 300 మందిని బస్సుల్లో తరలించి టెక్కలిలోని ఒక సినిమా థియేటర్ కు ఉదయం 9 గంటలకు తీసుకువస్తారు. వారికి అక్కడ ఇతర సదుపాయాలు కల్పిస్తారు. వారిని థియేటర్ లో కూర్చుండపెట్టి.. 10 గంటలకు లైవ్ ప్రసారం ద్వారా.. పవన్ కల్యాణ్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి.. లైవ్ లో పాల్గొంటారు. వారి సమస్యలను విని వీలైన వాటిని అక్కడికక్కడే పరిష్కరిస్తారు. అలాగే తన గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల పరంగా జరుగుతున్న పనులపై వారి అభిప్రాయాలను కూడా తెలుసుకుంటారు. ముఖాముఖి అనే విధానం పాతదే అయినప్పటికీ.. పవన్ కల్యాణ్ లైవ్ ప్రసారాలు, థియేటర్ లో ప్రసారం ద్వారా.. లార్జర్ దేన్ లైఫ్ సైజ్ ఇమేజి కల్పించడం ద్వారా దానిని వినూత్నంగా చేయబోతున్నారు.
డిప్యూటీ సీఎం పవన్.. భేషైన వినూత్న ప్రయోగం!
Friday, December 5, 2025
