వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రౌడీలు, గూండాలు రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా చెలరేగుతున్నారనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి చాలాకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. గతంలోనూ ఇప్పుడూ కూడా అలాంటి విమర్శలు అనేకం ఉన్నాయి. తాజాగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలో, సినిమా హీరో సాయిధరం తేజ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో జరిగిన అల్లర్లు, జనసేన కార్యకర్తల మీద జరిగిన దాడి వెనుక కడప, కర్నూలు నుంచి ప్రత్యేకంగా దిగుమతి అయిన అల్లరిమూకల ప్రమేయం ఉన్నదని ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి.
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జనసైనికులపై వైకాపా వర్గీయులు జనసేన కార్యకర్తలపై దాడికి దిగారు. మామయ్య పవన్ కల్యాణ్ గెలుపు కోసం ప్రచారం చేయడానికి వచ్చిన హీరో సాయి ధరం తేజ్ కాన్వాయ్ ముందుకు వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో అది నల్లల శ్రీధర్ అనే జనసేన కార్యకర్తకు తగిలింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.
సాయిధరంతేజ్ ప్రచారానికి అనూహ్య స్పందన రావడంతో సహించలేక వైసీపీ శ్రేణులు ఇలాంటి దుర్మార్గానికి పాల్పడినట్టుగా జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. వైసీపీ నాయకుల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని, కళ్ల ముందు ఓటమి కనిపిస్తూ ఉండడంతో.. వారు ఇలా దాడులకు దిగుతున్నారని పిఠాపురం తెలుగుదేశం ఇన్చార్జి.. పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్న వర్మ ఆరోపిస్తున్నారు. సోమవారం లోగా నిందితుల్ని అరెస్టు చేయకపోతే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అంటున్నారు. కడప, కర్నూలు నుంచి కొందరు అల్లరిమూకలు నియోజకవర్గంలోకి ప్రవేశించినట్లు సమాచారం ఉన్నదని, దాడులు చేయడమే లక్ష్యంగా వారున్నారని ఆయన ఆరోపించడం గమనార్హం.
అయితే.. గతంలో తెలుగుదేశం హయాంలో ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం నడిపినప్పుడు కూడా అల్లర్లు చెలరేగాయి. రైలు దహనం కూడా జరిగింది. అయితే ఆ అల్లర్లు, దహనాల వెనుక.. అవాంఛనీయ శక్తులు.. అల్లర్లే లక్ష్యంగా వచ్చిన కడప జిల్లా మూకలు ఉన్నట్టుగా విస్తృతంగా వినిపించింది. చూడబోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా పిఠాపురంలో తమ గెలుపు అసాధ్యం అని గ్రహించి.. అదే అల్లర్ల ఫార్ములాను ఫాలో అవుతున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. ప్రజలను భయాందోళనలకు గురిచేస్తే ఓటింగ్ శాతం తగ్గుతుందని, తాము నెగ్గగలమని వారు భావిస్తున్నట్టు ప్రజలు అంటున్నారు.
పిఠాపురం అల్లర్లకు కడపనుంచి డిప్యుటేషన్!
Sunday, December 22, 2024