పార్టీకి ద్రోహం చేసిన వారి మీద చర్యలు తీసుకోవడం, వచ్చే ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా ప్రక్షాళన చేయడం అనే పడికట్టు పదాలతో కూడిన కసరత్తును జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. వేటు వేయడం కూడా మొదలెట్టారు. పార్టీ అభ్యర్థి ఓడిపోయేలా తెలుగుదేశం అభ్యర్థికి సహకరించారనే ఆరోపణల మీద ఆయన కదిరి మాజీ ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డి మీద సస్పెన్షన్ వేటు వేశారు. జగన్ చెబుతున్న ప్రక్షాళన ప్రకారం.. ఇది మొదటి వేటు!
అయితే పీవీ సిద్ధారెడ్డిని పార్టీనుంచి సస్పెండ్ చేయడం అనేది సొంత పార్టీలోనే ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సస్పెన్షన్ మీద సిద్ధారెడ్డి స్పందిస్తూ.. తన వల్ల పార్టీ నష్టపోవడం అనేది జరగలేదని, పార్టీ వల్ల తానే నష్టపోయానని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. జగన్ నిర్ణయాన్ని ఆయన తప్పు పట్టారు. సస్పెన్షన్ వలన తనకు కొత్తగా జరిగే నష్టమేమీ లేదని కూడా అన్నారు.
సిద్ధారెడ్డి ఎపిసోడ్ ను పక్కన పెడితే.. 164 చోట్ల ఓడిపోయిన పార్టీలో.. ఎన్నిచోట్ల సొంత పార్టీలో ద్రోహులు ఉన్నారని జగన్ లెక్క వేయగలరు? ఎంత మంది వేటు వేయగలరు? అనే అంచనాలు ఇప్పుడు నడుస్తున్నాయి. జగన్ మంత్రి వర్గంలో పెద్దిరెడ్డి తప్ప మరొక్కరు ఎవ్వరూ గెలవనేలేదు. మరి మంత్రుల వెనుక గోతులు తవ్విన చిన్న నాయకులు ఎవ్వరని ఆయన నిర్ణయిస్తారు? అనేది కార్యకర్తల సందేహం. బొత్స వంటి కొమ్ములు తిరిగిన నాయకుడిని కూడా ఓడగొట్టేంతగా జగన్ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తగా.. దాన్ని కప్పెట్టడానికి కోవర్టులు పనిచేశారని నెపం పెడుతూ.. నేతల్ని బలిచేయడం తగదని అంటున్నారు.
జగన్ తన తెలివితేటలతో.. ఎన్నికలకు ముందు 32 చోట్ల సిటింగు అభ్యర్థులకు టికెట్ నిరాకరించారు. అంటే సిటింగులు అసమర్థులని ఆయన నమ్మారు. దాదాపుగా అన్నిచోట్ల కూడా వైసీపీ ఓడిపోయింది. మరి ఆయన సమర్థులని నమ్మిన వారు ఓడిపోతే.. ఆ పాపాన్ని ఇప్పుడు అసమర్థులని అనుకున్న వారి మీదకు నెట్టేస్తున్నారు. మొత్తం ఈ 32 నియోజకవర్గాల్లోనూ సొంత పార్టీ మాజీలందరినీ సస్పెండ్ చేసేస్తారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
పార్టీ ప్రక్షాళన అవసరమే గానీ.. అందులో విచక్షణ ఉండాలి. పూర్తిగా చెక్ చేసుకుని చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా.. ఎవరో ఒకరిని బలిచేస్తే పార్టీ పరువు దక్కుతుందని అనుకుంటున్నట్టుగా ఈ చర్యలు ఉంటున్నాయి.
అనుమాన భూతం: వేటు వేస్తే మిగిలేదెవరు?
Tuesday, January 21, 2025