మద్యం కుంభకోణంలో పేరు… జైల్లో పెడతామంటే పెట్టుకో .. కవిత సవాల్ 

Sunday, December 22, 2024

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో ముఖ్యమంత్రి కుమార్తె, టిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత పాత్రపై ఇప్పటివరకు మీడియా కథనాలకు మాత్రమే పరిమితం అవుతూ వస్తున్న ఆరోపణలు ఇప్పుడు అధికారికంగా వెల్లడి కావడంతో తెలంగాణాలో రాజకీయ ప్రకంపనలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

అయితే,  “జైల్లో పెడతామంటే ఇక చేసేదేముందని… పెట్టుకో” అంటూ కవిత ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి కవిత సవాల్ విసిరారు. భయపడే ప్రసక్తే లేదని చెబుతూఈడీ విచారణకు తాము సహకరిస్తామని చెప్పారు. మీడియాకు ముందే లీకులిస్తూ అలజడి రేపాలనుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. ఈడీ, సీబీఐలను ప్రయోగించి అత్యంత చైతన్యవంతమైన తెలంగాణలో అధికారంలోకి రావాలనుకోవడం జరిగే పని కాదని ఆమె హెచ్చరించారు. 

నలుగురు ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో కీలక బిజెపి నేతల అరెస్ట్ కోసం కేసీఆర్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సమయంలో రూ 100 కోట్లు ముడుపులు చేతులు మారడంలో కవిత కూడా కీలక పాత్రధారి అంటూ ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) స్పష్టం చేయడం కలకలం రేపుతున్నది.  నిర్దిష్ట సాక్ష్యాధారాలతో పకడ్బందీగా కవితపై కేసును ఈడీ రూపొందిస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడైంది. త్వరలోనే విచారణకు పిలిచి, అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఈ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. 

ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు రావడానికి ఒక ఏడాది ముందు ఆ రాష్ట్రానికి మోడీ కంటే ముందు ఈడీ వెళ్తుండటాన్ని మనం గమనిస్తున్నామని కవిత చెప్పారు. మోడీ పాలనలో ప్రభుత్వాలను కూల్చే కుట్రలు జరుగుతాయని అన్నారు. తెలంగాణలో వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి… మోడీ కంటే ముందు ఈడీ వచ్చిందని చెప్పారు. తన మీద కానీ, టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై కానీ ఈడీ దాడులు జరగడం సహజమేనని… వాటికి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. 

బుధవారం అరెస్ట్ చేసిన మద్యం​ వ్యాపారి అమిత్​ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరుతోపాటు అరబిందో ఫార్మా డైరెక్టర్​ శరత్​చంద్రారెడ్డి, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహా మొత్తం 36 మంది పేర్లను ఈడీ చేర్చింది. ​ లిక్కర్​ స్కామ్​లో కీలక నిందితుడు విజయ్​ నాయర్​కు సౌత్​ గ్రూప్​ (దక్షిణాది) నుంచి రూ. 100 కోట్లు అందాయని, ఈ గ్రూప్​ను కవిత, శరత్​చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి లీడ్​ చేశారని వెల్లడించింది. 

పైగా, ఆధారాలు దొరక్కుండా 10 మొబైల్ ఫోన్స్​ను కవిత డ్యామేజ్ చేయడం, మార్చడం వంటి చర్యలకు పాల్పడ్డారని, ఇందులో 6209999999 ఫోన్​ నంబర్​తో మాట్లాడినప్పుడు ఆరు ఫోన్లు, 8985699999 ఫోన్​ నంబర్​తో నాలుగు ఫోన్లు మార్చినట్లు, ధ్వంసం చేసినట్లు ఈడీ పేర్కొంది. గత ఏడాది సెప్టెంబర్​ 1 నుంచి ఈ నెల ఆగస్టు వరకు ఈ చర్యలకు పాల్పడ్డట్లు రిపోర్టులో వివరించింది. 

స్కామ్​తో సంబంధం ఉన్న 36 మంది నిందితులు/అనుమానితులు 170 ఫోన్లను మార్చారని, తాము కేవలం 17 ఫోన్లను మాత్రమే రికవరీ చేయగలిగామని తెలిపింది. మిగతా ఫోన్లను ఆధారాలు దొరకకుండా నిందితులు ధ్వంసం చేశారని, అవి దొరికి ఉంటే ముడుపుల లెక్క ఇంకా ఎక్కువగా ఉండేదని ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం.  ధ్వంసమైన 153 ఫోన్ల విలువ కోటీ 38 లక్షల వరకు ఉంటుందని వెల్లడించింది. 

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్​ సిసోడియా అనుచరుడు అమిత్ అరోరాను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి నాగ్ పాల్  ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా దాదాపు 32 పేజీల రిమాండ్ రిపోర్టు ను ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్(ఐఓ) జోగేందర్ దాఖలు చేశారు. ఈ రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక విషయాలను పొందుపరిచారు. 

రూ.100 కోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ చెల్లించిందని, సౌత్ గ్రూప్​ను శరత్ రెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ పేర్కొంది.  సౌత్ గ్రూప్ ద్వారా రూ.100 కోట్లను ఢిల్లీకి చెందిన ఆప్​ లీడర్​ విజయ్ నాయర్​కు చేరినట్లు తెలిపింది. వీటిన్నింటినీ దర్యాప్తులో ఇచ్చిన వాంగ్మూలంలో అమిత్ అరోరా ఒప్పుకున్నారని ఈడీ వెల్లడించింది. 

కవిత, బోయినపల్లి అభిషేక్​రావు, సీఏ బుచ్చిబాబు గత ఏడాది సెప్టెంబర్​ 1న ఒకే రోజు ముగ్గురు ఫోన్లు మార్చినట్లు ఈడీ గుర్తించింది. తర్వాత అదే నెల 24న అభిషేక్, బుచ్చిబాబు ఫోన్లు మారినట్లు వెల్లడించింది. తర్వాత అదే ఏడాది డిసెంబర్​ 30న మరోసారి అభిషేక్ ఫోన్ మార్చితే.. ఆ మార్నాడు 31న కవిత ఫోన్ చేంజ్ చేశారని తెలిపింది. 

ఈ ఏడాది ఆగస్టు 19న అభిషేక్ మొబైల్ మార్చితే, ఆగస్టు 20న బుచ్చిబాబు, రెండు రోజులు తర్వాత 22న కవిత వేరే ఫోన్ యూజ్ చేశారని వివరించింది. మళ్లీ మర్నాడు  23న కవిత రెండు ఫోన్లు మార్చారని తెలిపింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles