కడుపు మండితే ఆ ఆగ్రహాన్ని ఒక్కొక్కరూ వ్యక్తం చేసే తీరు ఒక్కో రకంగా ఉంటుంది. పవన్ కల్యాణ్ లాంటి నాయకులు గట్టిగా అరచి మీ అంతు చూస్తానంటూ ఆ ఆగ్రహాన్ని వెళ్లగక్కవచ్చు. వంగలపూడి అనిత వంటి నాయకులు కన్నీళ్లు పెట్టుకోవచ్చు. వైఎస్ షర్మిల కూడా తనదైన శైలిలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అన్నయ్య జగన్మోహన్ రెడ్డి నడుపుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆమె సైకో పార్టీగా అభివర్ణిస్తున్నారు. ఆ పార్టీ ఇచ్చే కిరాయి డబ్బులు తీసుకుంటూ కూలి డబ్బులకోసం సోషల్ మీడియాలో నీచమైన పోస్టులు పెట్టే వారిని ‘సోషల్ సైకో’లుగా అభివర్ణిస్తున్నారు. మానవ రక్త సంబంధాలు మరచిన మృగాలుగా ఆమె ఎవరిని అభివర్నిస్తున్నారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సైకో పార్టీగా జగనన్న రాజకీయ పార్టీని అభివర్ణించడం వైసీపీకి సరిగ్గా అతికినట్టు సరిపోయే నిర్వచనం అని ప్రజలు కూడా అనుకుంటున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ అనేది జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ. ఆయన కనుసన్నల్లోనే ఆ పార్టీలోని సకల వ్యవహారాలు నడుస్తుంటాయి. ఆయన అనుమతి లేకుండా అక్కడ చీమ చిటుక్కుమనడం కూడా జరగదు- ఆయన మాటకు ఎదురుచెప్పగల వారు ఆ పార్టీలో ఉండరు. అభిప్రాయాలను పంచుకునే వెసులుబాటు కూడా లేకుండా.. కేవలం చెప్పింది చేసుకుంటూ పోయే అతి విధేయులు మాత్రమే ఉండే పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్.
ఆ పార్టీ తరఫున తమ తమ ప్రత్యర్థులను విమర్శించడానికి వైసీపీ తరఫున మీడియా ముందుకు వచ్చి గళం విప్పే బొమ్మలు ఎవరివైనా కావొచ్చు. వారు మాట్లాడే మాటల స్క్రిప్టులు మాత్రం ఒకే చోట తయారవుతాయనే సంగతి రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. అధికార వికేంద్రీకరణ అంటూ మూడు రాజధానుల నాటకాల గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి.. పార్టీలో అధికారాన్ని అంతా కేంద్రీకృతంగా ఉంచుతారనే సంగతి కూడా అందరికీ తెలుసు. అందుకే రాష్ట్రంలో ఏమూల నుంచి ఏమూల వరకు పార్టీ నాయకుల్లో ఎవ్వరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినా.. అవన్నీ జగన్మోహన్ రెడ్డి మాటలుగానే ప్రజలు భావిస్తుంటారు.
ఇప్పుడు షర్మిల ఆవేదన కూడా అదే. ఆమె అంతగా కన్నీళ్లు పెట్టుకుంటున్నది కూడా అందుకే. తాను ‘వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురే కాదు’ అని అనగల ధైర్యం జగన్ అనుమతి లేకపోతే ఎవ్వరికీ రాదని ఆమె భావిస్తున్నారు. నిజానికి అది తన వ్యక్తిత్వాన్ని హననం చేయడం కాదు అని.. జగన్మోహన్ రెడ్డి స్వయంగా తన అనుచరులతో తన తల్లి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని షర్మిల భావిస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో చెలరేగే వారిని సైకోలుగా పేర్కొనడం మాత్రమే కాదు. జగనన్న పార్టీనే సైకో పార్టీగా ఆమె అభివర్ణిస్తున్నారు.
ReplyForwardAdd reaction |