తిరుమల తిరుపతి దేవస్థానాల్లో వివిధ హోదాల్లో ఉన్న అన్యమతస్థులైన ఉద్యోగులను తప్పించాలని కొత్త పాలకమండలి నిర్ణయించింది. తాజాగా అలా ఇతర మతాలకు చెందిన వారిని లెక్కతీశారు. మొత్తం 31 మంది వారు సమర్పించిన అధికారిక ధ్రువపత్రాల ప్రకారం అన్యమతస్తులు ఉన్నట్టుగా తేలింది. వీరిని ఉద్యోగాలనుంచి తొలగించడం లేదా ఇతర శాఖలకు బదిలీచేయడం, లేదా, వీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వడం ద్వారా తప్పించడం చేయాలని టీటీడీ చూస్తోంది.
దాదాపు ఇరవై వేల మందికి పైగా ఉద్యోగాలు చేస్తూండే తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలో కేవలం 31 మంది మాత్రమే అన్యమతస్తులు లెక్కతేలడం ఒక తమాషా. అయితే వీరంతా అధికారికంగా తమ ధ్రువప్రతాల ప్రకారం ఇతర మతాలకు చెందిన వారు అని.. అలా కాకుండా.. రికార్డుల్లో హిందువుగానే ఉంటూ… వ్యక్తిగతంగా హిందూ విశ్వాసాలను పాటించకుండా ఇతర మత విశ్వాసాలను పాటించేవారు వందల సంఖ్యలో ఉంటారని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. నిజానికి టీటీడీకిగానీ, భక్తులను ప్రభావితం చేసే విషయంలో గానీ.. హిందూ ధర్మానికి పెద్ద ప్రమాదం ఇలా హిందూ ముసుగులో ఉన్న ఇతర మతస్తుల వల్లనే జరుగుతుందని విమర్శలు వస్తున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానాల్లో అన్యమతస్తుల గురించిన వివాదం ఇప్పటిది కాదు. ఎన్నో సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, వైఎస్ జగన్ అయిన తర్వాత కూడా తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్నదనే వివాదాలు పలుమార్లు తెరపైకి వచ్చాయి. వారిద్దరూ క్రిస్టియానిటీని పాటించే నాయకులు కావడంతో వారి అండ చూసుకుని.. అన్యమతప్రచారానికి తెగబడుతున్నారనే విమర్శలు వచ్చాయి. అలాగే.. అలాంటి అన్యమతప్రచారం చేస్తున్న వారికి టీటీడీలో పనిచేసే అదే మతస్తులు దొంగచాటుగా సహకరిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏ మత సంస్థల ప్రార్థనాలయాలు, గుడులలోనైనా ఆ మతం వారే ఉండాలని, ఇతర మతాల వారు ఉద్యోగాలు చేయడం కరెక్టు కాదని చాలా కాలంగా డిమాండ్ ఉంది.
బిఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ గా నియమితులైన తర్వాత.. ఈ విషయంలో చాలా ఖచ్చితంగా వ్యవహరించారు. అన్యమతస్తులను కొనసాగించేది లేదని తేల్చిచెప్పారు. ఆ మేరకు బోర్డు సమావేశంలో నిర్ణయం కూడా తీసుకున్నారు. దానికి తగ్గట్టుగానే లెక్కలుతీస్తే అధికారిక ధ్రువపత్రాల ప్రకారం 31 మంది తేలారు. హిందూముసుగులో ఉన్న అన్యమతస్తుల గురించి, వారు చేసే చేటు గురించి ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా తేలలేదు.
హిందూత్వ ముసుగులో ఉన్నవారితోనే డేంజర్!
Sunday, December 22, 2024