ఇంకో మూడు రోజులు గడిస్తే మేనెల ఒకటో తేదీ వచ్చేస్తుంది. లబ్ధిదారులు తమ పింఛన్లకోసం ఎదురుచూసే రోజు. ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది? లబ్ధిదారులను రాచి రంపాన పెట్టకుండా.. ఎప్పటిలాగానే వారి ఇళ్ల వద్దకు పించన్లు అందివ్వడానికి సిద్ధంగా ఉందా? లేదా మరిన్ని పదుల సంఖ్యలో ప్రాణాలను అధికార పార్టీ కోసం బలి ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారా? ప్రతిపక్షాలను పాపాల భైరవుల్లా విలన్లలా ప్రొజెక్టు చేయడానికి ఇంకో కుట్ర రచన చేస్తున్నారా? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.
లబ్ధిదారులను ప్రలోభ పెట్టడమే పరమలక్ష్యంగా వాలంటీర్లను లోబరుచుకోవడానికి వైసీపీ అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేసిన తర్వాత.. అసలు పెన్షన్లను వాలంటీర్ల ద్వారా కోడ్ ఉన్న నెలల్లో పంపడానికి వీల్లేదని ఎన్నికల సంఘం స్పష్టంగా ఆదేశించింది. అయితే లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో సీఎస్ విఫలం అయ్యారు. చాలాచోట్ల ఒకటోతేదీ సాయంత్రం వరకు స్థానిక పంపిణీ అధికారం ఉన్న కార్యాలయాల బ్యాంకు ఖాతాలకు డబ్బు అందనేలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఈసారి మేనెలలో ప్రజలకు ఇబ్బంది లేకుండా పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఎలాంటి సన్నద్ధతతో ఉన్నదో సీఎస్ జవహర్ రెడ్డి తక్షణం ప్రకటించాల్సిన అవసరం ఉన్నదని ప్రజలు కోరుతున్నారు. ఆయన పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొన్ని విషయాల్లో వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని అంటున్నారు.
1) ప్రధానంగా ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రానికెల్లా డబ్బు కార్యాలయాల ఖాతాల్లోలకి డిపాజిట్ కావాలి. ఒకటోతేదీ ఉదయానికే పంపిణీ చేయడానికి సిద్ధంగా ఏర్పాటు జరగాలి. 30 సాయంత్రానికెల్లా డబ్బు బదిలీ జరుగుతుందని సీఎస్ ప్రకటన చేయాలి.
2) వాలంటీర్లు లేకపోయినంత మాత్రాన వ్యవస్థ ఆగిపోదు అని సీఎస్ నిరూపించాలి. సచివాలయ సిబ్బంది ద్వారా గానీ, ఇతర రెవెన్యూ సిబ్బంది ద్వారా గానీ.. ఏ రూపంలోనైనా లబ్ధిదారుల ఇళ్లవద్దకే పింఛన్లు అందుతాయని, ఏ ఒక్కరూ కూడా ఎండల్లో సచివాలయాల వద్దకు రావాల్సిన అవసరం లేదని సీఎస్ స్పష్టమైన ప్రకటన చేయాలి.
3) ఎన్నికల సంఘం చెప్పిన విధంగా ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా పంపిణీ ఉంటుందని హామీ ఇవ్వాలి.
ఈ ప్రకటనలు గనుక.. సీఎస్ జవహర్ రెడ్డి నుంచి రాకపోతే గనుక.. ఆయనకూడా వైఎస్సార్ కాంగ్రెస్ పన్నుతున్న కుట్రలో భాగంగానే ఇలా చేస్తున్నట్టు భావించాల్సి ఉంటుందని ప్రజలు అంటున్నారు. సీఎస్ ప్రజల్లో గందరగోళాన్ని, ఆందోళనను తొలగించడానికి సత్వరం ప్రకటన చేయాలని కోరుతున్నారు.