కాంగ్రెస్ అంటే సిపిఐ కు చులకనా?

Saturday, May 18, 2024

సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసి కనీసం ఒక్క సీటు అయినా గెలుచుకోగలం అనే నమ్మకం వారికి లేదు. ఏదో ఒక పెద్ద పార్టీ అండ ఉంటే తప్ప శాసనసభలోకి ప్రవేశించగల ప్రజాబలాన్ని వారు ఎన్నడో కోల్పోయారు. అయినా సరే ఇతరుల అండతో తమ పార్టీని మనుగడలో ఉంచుకోవాలని ఆరాటపడుతున్నారు. అందులో తప్పులేదు. తాము భావిస్తున్న తమ బలాన్ని బట్టి తమకు ఇన్ని సీట్లు కావాలని, పొత్తు పెట్టుకుంటున్న పెద్ద పార్టీలను అడగడంలో కూడా తప్పులేదు. కానీ భారత రాష్ట్ర ప్రభుత్వ ఒక రకంగా- కాంగ్రెసుతో మరో రకంగా డిమాండ్లు వినిపించడమే, పట్టుబట్టడమే చిత్రంగా కనిపిస్తోంది. తెలంగాణలోని సిపిఐ నాయకులకు కాంగ్రెస్ పార్టీ అంటే అంత చులకన భావం ఉన్నదా అనే అభిప్రాయం ఏర్పడుతోంది.

మునుగోడు ఎన్నిక పూర్తయిన దగ్గర నుంచి భారాసతో తాము స్నేహబంధం కలిగి ఉన్నామని వామపక్షాలు పదేపదే గుర్తు చేసుకుంటూ వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలు నాటికి కూడా ఈ స్నేహబంధం కొనసాగుతుందని వారు పదే పదే చెబుతూ వచ్చారు. ఇలాంటి పొత్తు బంధానికి సంబంధించిన మాటలు వామపక్షాల వైపు నుంచి వినిపించాయి తప్ప, కెసిఆర్ గానీ ఆయన పార్టీలో కీలక నాయకులు మరెవరైనా గాని ఆ ప్రస్తావన కూడా తేలేదు.

ఇలాంటి నేపథ్యంలో ఎన్నికలు ముంచుకు రాగానే భారాసతో తమ స్నేహబంధం గురించి వామపక్షాలు ఆశగా మాట్లాడాయి. కేసీఆర్ తమని పిలుస్తారని, మంతనాలు సాగిస్తారని, సీట్లు పంచి పెడతారని, తాము పోటీ చేసి సభలో అడుగుపెడతామని వారు ఆశిస్తూ వచ్చారు. కేసీఆర్ స్వయంగా పూనుకోకపోయినప్పటికీ పార్టీ ప్రతినిధులు వారితో మంతనాలు జరపడం మాత్రం జరిగింది. తమకు మూడు సీట్లు కావాలని అడిగిన వామపక్షాలతో.. ఒక్క ఎమ్మెల్యే సీటు, రెండు ఎమ్మెల్సీ సీట్లు మాత్రం ఇస్తామని భారాస బేరం పెట్టింది. అందుకు ఒప్పుకోకపోవడం వలన బేరం కుదరలేదు. పొత్తు ఏర్పడలేదు.

ఆ తర్వాత నుంచి వామపక్షాలు కాంగ్రెసు చుట్టూ తిరుగుతున్నాయి. కేంద్రంలో కూడా ఇండియా కూటమిలో తాము భాగస్వాములం అనే అంశాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాయి. అయితే కాంగ్రెస్ చెంతకు వచ్చేసరికి సిపిఐ ఏకంగా ఐదు స్థానాలను డిమాండ్ చేసి, మూడు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. భారాసతో మాట్లాడినప్పుడు రెండు స్థానాలు చాలు అనుకున్న సిపిఐ, కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి మూడింటి కోసం పట్టుబట్టడం అనేది చిత్రమైన పరిణామం. అసలే సీట్ల కోసం బీభత్సమైన పోటీతో సతమతం అవుతున్న కాంగ్రెస్ పార్టీ వారి డిమాండు పట్ల ఏ విధంగా స్పందిస్తుందో.. వారికి ఎన్ని కేటాయిస్తుందో.. అసలు వీరి మధ్యనైనా కొత్త పొత్తులు పొడుస్తాయో లేదో వేచి చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles