జంట అరెస్టులు : మూల విరాట్టులకు ముచ్చెమటలు!

Wednesday, December 10, 2025

సుమారుగా పన్నెండు గంటల వ్యవధిలో జరిగిన రెండు అరెస్టులు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పునాదుల్లో ప్రకంపనాలు పుట్టిస్తున్నాయి. చూడడానికి  ఈ రెండు అరెస్టులు ఒకదానితో ఒకటి సంబంధంలేని వేర్వేరు కేసులతో ముడిపడినట్టివి. కానీ ఈ రెండు కేసుల్లో అంతిమ లబ్ధిదారులు ఎవరు? అనేది ఇక్కడ కీలకం. అరెస్టు అయిన వ్యక్తులు.. నిజాయితీగా వ్యవహరించదలచుకున్నా గానీ, పోలీసుల విచారణ ఒత్తిడిని తట్టుకోలేకపోవడం వల్ల గానీ నిజాలు చెప్పేస్తే ఎవరికి ప్రమాదకరం అనేది కీలకం.  అందుకే అధికారంలో ఉన్న రోజుల్లో ఇటు ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం తమ చెప్పు చేతల్లో పెట్టుకుని, పోలీసుల్ని తమ ఇంటి పనివారిలాగా వాడుకుంటూ.. వారితో అడ్డగోలుగా తాము పురమాయించిన పనులు చేయిస్తూ వచ్చిన పెద్దలకు ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి.

ఈ రెండు కేసుల్లోనూ ఇద్దరు ‘నెంబర్ టూ’ లకు ముప్పు పొంచి ఉంది. జగన్ అధికారంలో ఉన్న రోజుల్లో నెంబర్ వన్ నుంచి హండ్రెడ్ వరకు అన్ని పొజిషన్లూ ఆయనవే అని బాబాయి వైవీ సుబ్బారెడ్డి ప్రెస్ మీట్లో చాటి చెప్పడానికి ప్రయత్నించారు. కానీ, నెంబర్ టూ నేనంటే నేనే నని ప్రభుత్వంలో తమ పెత్తనం నిరూపించుకోవడానికి ప్రయత్నించిన ప్రముఖులు చాలా మందే ఉన్నారు. వారిలో ఇద్దరికి ఈ రెండు కేసుల రూపేణా ప్రమాదం పొంచి ఉందని పలువురు అంచనా వేస్తున్నారు.

లిక్కర్ స్కామ్ లో ‘కర్త కర్మ క్రియ’గా పేరుతెచ్చుకున్న కీలక నిందితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇప్పుడు అరెస్టులో ఉన్నారు. ఆయన మాట్లాడడం మొదలెడితే చాలా విషయాల్లో స్పష్టత వస్తుంది. కేవలం డిస్టిలరీ ల యజమానుల నుంచి తమకు రావాల్సిన వాటాలు వసూలు చేయడానికి ఉద్యోగుల్ని పెట్టి, వారినుంచి క్యాష్ హ్యాండర్లకు చేరవేసి వారి నుంచి కొరియర్ల ద్వారా ఒక ఆర్గనైజరుకు సొమ్ము చేరవేస్తే అక్కడినుంచి అదంతా రాజ్ కెసిరెడ్డికి అందేది. రాజశేఖర రెడ్డినుంచి ఆ సొమ్ము తీసుకుని సదరు నల్లధనాన్ని వివిధ రూపాల్లోకి మార్చి బిగ్ బాస్ కు చేర్చడం అనేది మరొకరి విధి. ఆ స్థానంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కీలక భూమిక పోషించినట్టుగా వార్తలు వచ్చాయి. మిథున్ రెడ్డి అంటే.. వైసీపీ ప్రభుత్వంలో ఒకానొక నెంబర్ టూ అయిన రామచంద్రారెడ్డి కొడుకు. జగన్ కు అత్యంత సన్నిహితుడు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నుంచి చాలా పక్కాగా వివరాలు సేకరించకుండా మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం.. ఆయన నోటివెంట బిగ్ బాస్ ఎవరో చెప్పించడం అంత సులువు కాదు. అందుకే కసిరెడ్డి నోరు విప్పితే ఒక నెంబర్ టూ స్థాయి వరకు ముప్పు పొంచి ఉంది.

కాదంబరి జత్వానీ కేసు విషయానికి వస్తే.. అప్పటి ఇంటెలిజెన్స్ చీప్ పీఎస్సార్ ఆంజనేయులు ప్రభుత్వ పెద్దల చేతిలో ఒక టూల్ గా మాత్రమే పనిచేశారు. ఆమె సంగతి చూడవలసిందిగా జగన్ ప్రభుత్వంలో అందరూ ఎరిగిన నెంబర్ టూ, సకల శాఖల మంత్రిగా అప్పట్లో పేరు తెచ్చుకున్న సజ్జల రామక్రిష్ణారెడ్డి ఉన్నారని గతంలో మీడియాలో ప్రముఖంగానే వచ్చింది. ఇప్పుడు అరెస్టు అయి ఉన్న పీఎస్సార్ ఆంజనేయులు ఎంత ఒత్తిడి తర్వాత ఆ పేరు బయటపెడతారు అనేది కీలకం. కానీ బయటపెట్టక తప్పని పరిస్థితి. పీఎస్సార్ అరెస్టు కాగానే.. ఆయన మీద ఉన్న ఇంకా అనేక కేసులు కూడా తెరమీదకు వస్తున్నాయి. సదరు అన్ని కేసుల్లో పీటీవారెంటు ద్వారా అరెస్టులు షురూ అయితే.. ఆయన ఇప్పట్లో బెయిలు తెచ్చుకోవడంకూడా సాధ్యం కాకపోవచ్చు.

అరెస్టు అయిన వారు ఏ బలహీన క్షణంలో అయినా తమతో పనిచేయించిన వారి పేర్లు చెప్పేయవచ్చు. ఈ ఇద్దరు నెంబర్ టూలకు అదే టెన్షన్ గా ఉంది. అయితే బిగ్ బాస్ కు తక్షణ ప్రమాదం లేదని ఈ నెంబర్ టూలు కూడా అరెస్టు అయిన తర్వాత.. వారు వెల్లడిస్తేనే ఆయన దాకా పోలీసులు వెళ్లగలరని పలువురు అంచనా వేస్తున్నారు.  

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles