ప్రపంచం మొత్తం తలతిప్పి చూసేలాగా, రాష్ట్రప్రజలందరూ గర్వించేలాగా అమరావతి రాజధానిని కూటమి ప్రభుత్వం చురుగ్గా నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అమరావతిలో ఈ కలల రాజధాని సాకారం కావడానికి యాభైవేల ఎకరాల భూములను ఆ ప్రాంతానికి చెందిన రైతులు లాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చారు. అక్కడి రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తూ ఉంది. కానీ.. అదే ప్రాంతంలో.. పొలం లేని రైతు కూలీలకు కూడా రాజధాని పూర్తయ్యేవరకు పెన్షన్లు ఇవ్వడానికి అప్పట్లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, సీఆర్డీయే చట్టంలో పెట్టింది. ఆ ప్రాంతంలో పొలాలన్నీ రాజధానికోసం ఇచ్చేయడం వలన, రైతులకు డబ్బు లేదా రిటర్నబుల్ ప్లాట్స్ దక్కుతాయి గానీ.. రైతుకూలీల బతుకులు నిరాధారంగా మారుతాయనే సదుద్దేశంతో చంద్రబాబు ఈ పెన్షన్లను ఏర్పాటుచేశారు.
అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. అమరావతి మీద కక్ష కట్టారనే సంగతిని కూడా రాష్ట్రప్జజలందరూ గుర్తించారు. నిజానికి ఆయన అమరావతి రాజధాని మీద మాత్రమే కాదు, ఆ ప్రాంత రైతులు, గతిలేని నిరుపేదల మీద కూడా కక్ష కట్టారు. అక్కడ పింఛన్లు పొందుతున్న పొలంలేని పేద కూలీల్లో 1575 కుటుంబాలకు పింఛన్లను నిలిపివేశారు. దుర్మార్గంగా వారి కడుపు కొట్టారు. వేరే గతిలేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే దుస్థితిని కల్పించారు.
కానీ ఎన్డీయే కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత.. అయిదేళ్లలో జగన్ చేసిన విధ్వంసాన్ని, చేసిన పాపాల్ని ఒక్కటొక్కటిగా సరిచేయడానికి ప్రయత్నిస్తూనే వస్తోంది. ఆ క్రమంలో భాగంగానే.. అమరావతి ప్రాంతంలో పొలంలేని రైతుకూలీలకు పింఛన్లను తాజాగా పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఆ ప్రాంతానికి గొప్ప శుభవార్త అని అందరూ హర్షిస్తున్నారు.
జగన్మోహన రెడ్డి కొన్ని వర్గాల పట్ల కక్షపూరితంగా వ్యవహరించారనేది నిజం. ఆయన అమరావతిని ద్వేషిస్తుండవచ్చు.. అమరావతి రాజధాని ప్రాంతాన్ని స్మశానంగా మార్చేయాలని తపన పడుతుండవచ్చు. అందుకోసం తన అయిదేళ్ల పదవీకాలాన్ని ఆయన ఖర్చు చేసి ఉండవచ్చు. కానీ.. అమరావతి మీద కక్షతో ఆ ప్రాంతంలో పొలాలు కూడా లేని నిరుపేద రైతు కూలీ కుటుంబాల జీవితాలతో ఆడుకోవడం గురించి అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అన్న క్యాంటీన్లను ఏ రకంగా అయితే మూయించేసి పేదల కడుపు కొట్టారో.. అదే తరహా దుర్మార్గపు బుద్ధులతో జగన్మోహన్ రెడ్డి.. ఈ పింఛనుదారుల కడుపుకొట్టారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం ఆ పెన్షన్లను పునరుద్ధరించడంతో వారి జీవితాల్లో తిరిగి సంతోషం తొణికిసలాడుతోంది.
అమరావతి నిరుపేదలకు ఇంతకంటె శుభవార్త ఉంటుందా?
Friday, December 5, 2025
