జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో ఆయన అండ చూసుకుని, ఆయన కళ్లలో ఆనందం చూడడం కోసం అనేక మంది అధికారులు కూడా బరితెగించి ప్రవర్తించారు. అలాంటి వారిలో ఐఅండ్ పీఆర్ శాఖకు కమిషనర్ గా పనిచేసిన తుమ్మా విజయకుమార్ రెడ్డి కూడా ఒకరు. జగనన్న కళ్లలో ఆనందం చూడడానికి ఆయన తన పదవిని శక్తివంచన లేకుండా తాకట్టు పెట్టారు. జగనన్న సొంతపత్రిక సాక్షికి, ఆయన సాక్షి చానెల్ కు ప్రభుత్వ ఖజానా సొమ్మును అడ్డగోలుగా దోచిపెట్టడానికి కూడా.. ఇతోధికంగా కృషి చేశారు. ఆ మాటకొస్తే.. ఆ రీతిగా జగనన్న సేవలో తరించడం కోసమే.. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న ఆయన పనిగట్టుకుని రాష్ట్ర సేవల్లోకి వచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే.. గుట్టుచప్పుడు కాకుండా కనీసం ప్రభుత్వానికి సమాచారం కూడా ఇవ్వకుండా.. తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఇంత అరాచకంగా బరితెగించి ప్రవర్తించిన అధికారి.. పోలీసులు కేసు నమోదు చేస్తే.. విచారణలో కూడా అదే బరితెగింపును ప్రదర్శిస్తున్నారు.
తుమ్మా విజయకుమార్ రెడ్డి ఐఅండ్ పీఆర్ కమిషనర్ గా మొత్తం దినపత్రికలకు ఇచ్చిన ప్రభుత్వ ప్రకటనల్లో 37 శాతం ఒక్క సాక్షి పత్రికకే అడ్డగోలుగా దోచిపెట్టారు. అది మాత్రమే కాదు. టారిఫ్ రివైజ్ చేయడంలో.. ఆ పత్రిక వారు ప్రతిపాదించిన ధరల కంటె ఎక్కువ ధరలను టారిఫ్ గా ఆయన నిర్ణయించి.. అడ్డగోలుగా ప్రవర్తించారనే ఆరోపణలున్నాయి. ప్రతికలకు ప్రకటనలు ఇవ్వడంలో అత్యధిక సర్కులేషన్ ఉన్న పత్రిక ఏదో, ఏబీసీ రిపోర్టులప్రకారం పరిగణనలోకి తీసుకుని.. వారికి ప్రధానంగా ఇవ్వాలని ఉన్న నిబంధనలు అన్నింటినీ దాదాపుగా తుంగలో తొక్కేశారు. కేవలం పత్రిక మాత్రమే కాదు.. సాక్షి ఛానెల్ కు కూడా అడ్డగోలుగా ప్రకటనల నిధులు పంచిపెట్టడంలో తన మార్కు చూపించారు.
తీరా వందల కోట్ల రూపాయల ప్రకటనల బాగోతంపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నోటీసులు ఇస్తే.. హాజరు కాకుండా, కోర్టు ద్వారా అనుమతి పొంది ఫలానా తేదీన అయితే రాగలనని చెప్పిన తుమ్మా విజయకుమార్ రెడ్డి తొలిరోజు విచారణలో అసలు ఏ ప్రశ్నలకూ సూటి జవాబులు చెప్పకుండా.. తెలియదు గుర్తులేదు లాంటి వైసీపీ నాయకుల రొటీన్ టెక్నిక్ ప్రయోగించారు. రెండోరోజు కూడా విచారణకు రావాలని అధికారులు పురమాయించిన తరువాత.. ఆ రోజున తనలోని అసలు బరితెగింపును ప్రదర్శించారు.
నా ముందున్న అధికారులు ఎలాంటి పద్ధతి అనుసరించారో.. నేను కూడా అదే పనిచేశా. నేను చేసింది తప్పనుకుంటే 2014-19 మధ్య ఉన్న అధికారులు చేసింది కూడా తప్పే.. లాంటి పెడసరపు సమాధానాలు చెప్పి అధికారులను విస్మయపరిచారు. ప్రభుత్వం మారగానే ఎలాంటి సమాచారం కూడా ఇవ్వకుండా కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవడం గురించి ప్రశ్నిస్తే.. ఎవరికీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అలా చెప్పకుండా వెళ్లిపోయే హక్కు నాకు ఉంది.. అంటూ తుమ్మా సమాధానాలు ఇవ్వడంతో అధికారులే ఖంగుతిన్నారు. మూడోరోజుకూడా ఆయనను విచారించనున్నారు. ఎవరి పురమాయింపుతో సాక్షికి అధిక ధరలు నిర్ణయించారు.. సాక్షికి అధిక ప్రకటనలు ఇచ్చారు.. వంటి.. ఏ ఒక్క ప్రశ్నకూ సూటిగా జవాబివ్వకపోవడంతో.. మూడోరోజైనా వివరాలు రాబట్టాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.